‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాకు అవార్డు ఇవ్వడమేంటి?: స్టాలిన్
X
కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ప్రకటించిన వేళ.. ఒక పక్క ప్రశంసలు, మరో పక్క విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో వివాదాస్పద చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’కి కూడా జాతీయ అవార్డ్ లభించింది. బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటెగ్రిట్ విభాగంలో నర్గీస్ దత్ అవార్డ్ ను ఈ సినిమాకు ప్రకటించారు. ఈ సినిమా విడుదలైన టైంలో దేశ వ్యాప్తంగా వివాదాలు, నిరసనల మధ్య ఈ సినిమా అఖండ విజయం సాధించింది. వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ముస్లిం వర్గాలు, సమైక్యవాదుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సినిమాను తీసుకొచ్చారని కొందరు విమర్శించారు. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ సినిమాపై విమర్శలు గుప్పించారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్న ఈ సినిమాకు జాతీయ సమైక్యత విభాగంలో అవార్డ్ ఇవ్వడం ఏంటని ఆయన అన్నారు. ది కశ్మీర్ ఫైల్స్ కు జాతీయ అవార్డ్ ఇవ్వడం ముమ్మాటికి జాతీయ సమగ్రతను దెబ్బతీయడమే అవుతుందని ఆయన ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.