కర్నాటకలో ఘోర ప్రమాదం.. రెండు లారీల మధ్య నుజ్జునుజ్జైన కారు.
X
కర్నాటకలోని విజయనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్, లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరికొంతమంది గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హోసపేట నియోజకవర్గం వ్యాసంకేరి సమీపంలో నేషనల్ హైవే 50పై ఈ ప్రమాదం జరిగింది. టిప్పర్ అదుపుతప్పి అవతలి పక్కన ఉన్న కారును ఢీకొట్టింది. ఇదే సమయంలో కారును మరోసారి లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. రెండు లారీల మధ్య చిక్కుకుని కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది.
హోసపేటకు చెందిన ఓ కుటుంబం విజయనగర్ జిల్లా కూలహళ్లి గోణిబసవేశ్వర ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు ఉమ, కెంచవ్వ, భాగ్య, అనిల్, గోని బసప్ప, భీమలింగప్ప, యువరాజుగా గుర్తించారు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలు కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాల్లో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాద సమయంలో కారులో 13 మంది ఉన్నారని, గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు,