Gas Cylinder:భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. టిఫిన్లు మరింత ప్రియం
X
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. గృహవినియోగ సిలిండర్ ధరను రూ. 200 తగ్గించి కాస్త ఉపశమనం కలిగించిన కేంద్రం ఈసారి 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరకు పెద్ద వాత పెట్టింది. హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలు కొనే 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ. 209 పెంచింది. స్థానిక పన్నులు కూడా కలుపుకుంటే ధర మరింత పెరుగుతుంది. పెంచిన ధర ఈ రోజు నుంచే(అక్టోబర్ 1) అమల్లోకి వచ్చింది. దీంతో హోటల్ భోజనాల, టిఫిన్ల ధరలు చుక్కలను తాకనున్నాయి. ప్లేటు టిఫిన్ ప్రస్తుతం రూ. 30 నుంచి రూ. 50 మధ్య ఉండగా ధర పెంపుతో రూ. 40 నుంచి రూ. 60కి పెరిగే అవకాశం ఉంది.
అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం పెరగలేదు. రూ 950కే అందుబాటులో ఉంది. డెలివరీ చార్జీలతో కలుపుకుని రూ. 1000 తీసుకుంటున్నారు. రూ. 1150గా ఉన్న ఈ సిలిండర్ ధరను గత నెలాఖర్లో కేంద్రం రూ. 200 తగ్గించింది. త్వరలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కమర్షియల్ సిలిండర్ ధను రూ.200 పెంచి పరోక్షంగా దెబ్బ కొట్టింది. ఇక డొమెస్టిక్ సిలిండర్‌పైనా ఎంతో కొంత వడ్డన ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1731, కోల్‌కతాలో రూ.1839, ముంబైలో రూ.1684, చెన్నైలో రూ.1898కి చేరింది.