Dheeraj Sahu : కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో 351 కోట్లు.. ఆయన ఏం అన్నారంటే..?
X
కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు.. ఇటీవల ఐటీ దాడులతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగింది. ఆయన నివాసాల్లో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో 351 కోట్ల రూపాయలు దొరికాయి. దేశంలో ఇప్పటివరకు పట్టుబడిన నగదు నిల్వల్లో ఇదే పెద్ద మొత్తం కావడం గమనార్హం. ఈ దాడులపై ఎట్టకేలకు ధీరజ్ సాహు స్పందించారు. ఆ డబ్బు తనది కాదని.. తన కుటుంబానిది అని తెలిపారు. తమది కుటుంబం 100ఏళ్ల నుంచి మద్యం వ్యాపారం చేస్తోందని.. అదంతా మద్యం అమ్మకాల ద్వారా వచ్చిందేనని చెప్పారు. ఆ డబ్బుతో కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీలకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
దాదాపు 35 ఏళ్లుగా తాను క్రియాశీల రాజకీయాల్లో ఉన్నానని.. తనపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారని ధీరజ్ సాహు అన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నానని.. వ్యాపారంపై పెద్దగా దృష్టి పెట్టలేదన్నారు. తన కుటుంబసభ్యులు వ్యాపార వ్యవహారాలను చూసుకుంటారని చెప్పారు. తమ వ్యాపారం పారదర్శకంగా ఉంటుందని.. మద్యం వ్యాపారంలో అమ్మకాలు నగదు రూపంలో జరుగుతున్నందున ఇంట్లో నగదు ఎక్కువగా ఉందన్నారు. సీజ్ చేసిన డబ్బంతా నల్ల డబ్బా లేదా చట్టబద్ధమైనదా అని ఐటీ శాఖ చెబుతుందని తెలిపారు.
ఎంపీ సాహూకు చెందిన బౌద్ధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు దాని అనుబంధ సంస్థల్లో ఈ నెల 6న ఐటీ తనిఖీలు ప్రారంభమయ్యాయి. సాహు కుటుంబంతోపాటు డిస్ట్రిబ్యూటర్ల ఇళ్లు, కంపెనీల్లోనూ తనిఖీలు చేశారు. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌లోని 30 నుంచి 40 చోట్ల సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా రూ.351 కోట్ల నగదుతోపాటు 3 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును లెక్కించేందుకు అధికారులు కొన్ని రోజులు పట్టింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.