Home > జాతీయం > త్వరలో రాహుల్ రెండో విడత భారత్ జోడో యాత్ర..?

త్వరలో రాహుల్ రెండో విడత భారత్ జోడో యాత్ర..?

త్వరలో రాహుల్ రెండో విడత భారత్ జోడో యాత్ర..?
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పార్టీలో కొత్త ఉత్సాహం నింది. ఆయన పాదయాత్రకు వివిధ రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి అధికారం చేపట్టేందుకు ఈ యాత్ర దోహదం చేసిందన్న వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో జోష్ మరింత పెంచేందుకు రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే మరోసారి భారత్ జోడో యాత్ర ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఎన్నికలున్న రాష్ట్రాలపై నజర్

ఈ ఏడాది తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ, 2024లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఐదు రాష్ట్రాలను కవర్ చేసేలా రాహుల్ రెండో విడత పాదయాత్ర ఉంటుందని సమాచారం. ఆగస్టు 15, సెప్టెంబర్ 12 లేదా అక్టోబర్ 2న రాహుల్ యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. పోర్ బందర్ నుంచి భారత్ జోడో యాత్ర 2.0 ప్రారంభం కానున్నట్లు సమాచారం. త్రిపురలోని అగర్తలాలో ముగిసేలా యాత్ర ప్లాన్ చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

రిపోర్ట్ రెడీ అయిన వెంటనే

భారత్ జోడో యాత్ర జాతీయ సమన్వయ కమిటీకి నేతృత్వం వహిస్తున్న సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పార్టీ సీనియర్లతో యాత్రపై చర్చించినట్లు తెలుస్తోంది. గత అనుభవం దృష్ట్యా అందరూ పాదయాత్ర కంటిన్యూ చెయ్యాలన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈసారి ఏయే రాష్ట్రాల్లో యాత్ర చేపట్టాలి? ఏయే తేదీల్లో ఎక్కడికి వెళ్లాలి అనే అంశంపై రిపోర్ట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారత్ జోడో యాత్ర ఉండేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రిపోర్ట్ సిద్ధమైన వెంటనే హైకమాండ్ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ యాత్రపై క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

తొలివిడతలో 136 రోజులు

గతేడాది సెప్టెంబర్ 7 రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి తొలి విడత భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. దాదాపు 136 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. తొలివిడత యాత్ర జమ్మూ కాశ్మీర్ లో ముగిసింది.

Updated : 29 July 2023 9:51 AM IST
Tags:    
Next Story
Share it
Top