Home > జాతీయం > కాంగ్రెస్కు ఎదురుదెబ్బ.. బీజేపీలోకి కీలక నేత

కాంగ్రెస్కు ఎదురుదెబ్బ.. బీజేపీలోకి కీలక నేత

కాంగ్రెస్కు ఎదురుదెబ్బ.. బీజేపీలోకి కీలక నేత
X

లోక్సభ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పగా.. తాజాగా మరో కీలక నేత కమలం గూటికి చేరనున్నారన్న వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ హస్తం పార్టీకి హ్యాండిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కమల్నాథ్ తన కొడుకు, ఎంపీ నకుల్నాథ్తో కలిసి త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ బీజేపీలో చేరుతారని గతకొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా కమల్నాథ్ సైతం కమలం గూటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో ఆయన ఢిల్లీకి చేరుకోవడం మరింత ఆసక్తికరంగా మారింది. పార్టీలో చేరికపై బీజేపీ పెద్దలతో చర్చించేందుకే ఆయన హస్తినకు వచ్చారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని కొందరు రిపోర్టర్లు ఆయన వద్ద ప్రస్తావించగా.. పార్టీ మార్పుపై తనకన్నా మీడియానే ఎక్కువ ఆసక్తి చూపుతోందని అన్నారు. ఒకవేళ తాను బీజేపీలో చేరితే ముందుగా ఆ విషయం మీడియాకే చెప్తానని అన్నారు.

ఇదిలా ఉంటే కమల్నాథ్ ఢిల్లీ చేరుకున్న వెంటనే ఆయన కుమారుడు నకుల్ నాథ్ తన సోషల్ మీడియా అకౌంట్లలో మార్పు చేయడం పార్టీ మార్పు ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతోంది. నకుల్నాథ్ ట్విట్టర్ హ్యాండిల్లో కాంగ్రెస్ పదం తొలగించడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ఎంపీగా మధ్యప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నకుల్ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తన తండ్రి సొంత నియోజకవర్గమైన చింద్వారా నుంచి బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. ఈసారి కమల్నాథ్ ఎన్నికల్లో పోటీ చేయరని చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం నకుల్ అభ్యర్థిత్వానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరోవైపు బీజేపీ ఎవరు వచ్చినా చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడంపై ఆ పార్టీ నేతలు చాలా మంది ఆగ్రహంతో ఉన్నారని వారంతా బీజేపీలో చేరేందుకు ఆసక్తిచూపుతున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

Updated : 17 Feb 2024 5:25 PM IST
Tags:    
Next Story
Share it
Top