బీజేపీకి చెక్.. మైనారిటీ ఓట్లపై కాంగ్రెస్ నజర్
X
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో జాతీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికారం కోసం కాంగ్రెస్, హ్యాట్రిక్ విజయం కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటితే కేంద్రంలో అధికారం సునాయాసంగా చేజిక్కించుకోవచ్చని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఓ అడుగు ముందేసిన కాంగ్రెస్ బీజేపీ హిందుత్వ కార్డుకు చెక్ పెట్టేందుకు సరికొత్త వ్యూహాలతో ప్రజలతో దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.
మైనారిటీల కోసం రోడ్ మ్యాప్
కులాలవారీగా జనగణనకు పట్టుబడుతున్న కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలిపోకుండా పెద్ద స్కెచ్ వేసింది. మైనార్టీలను ఏకం చేసి గంపగుత్తగా వారి ఓట్లను కొల్లగొట్టేందుకు ప్లాన్ రెడీ చేసింది. మిషన్ 2024లో భాగంగా కాంగ్రెస్ మైనార్టీ సెల్ రోడ్ మ్యాప్ సిద్ధం చేయగా దానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇప్పటికే ఆమోదముద్ర వేశారు. ఇందులో భాగంగా ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న100 ప్రాంతాలను ఎంపిక చేసిన కాంగ్రెస్ అక్కడి ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది.
భారత్ జోడో భాయిచారా సమ్మేళన్
మరోవైపు భారత్ జోడో భాయిచారా సమ్మేళన్ పేరుతో వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. కేవలం ముస్లింలనే కాకుండా సిక్కులు, క్రిస్టియన్లు, జైనులతో క్షేత్రస్థాయిలో మమేకం కావాలని నిర్ణయించింది. మరోవైపు యూపీఏ హయాంలో దళిత, వెనుకబడిన వర్గాలకు చెందిన ముస్లింల కోసం అమలు చేసిన పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా యూపీఏ హయాంలో ఇచ్చిన సబ్సిడీలకు మోడీ సర్కారు ఏ విధంగా కోత పెట్టిందన్న విషయాన్ని బుక్ లెట్లు, పాంప్లెట్ల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది.
భారీ బహిరంగ సభ
ఇటీవలి కాలంలో బీజేపీ దళిత, వెనుకబడిన వర్గాలకు చెందిన ముస్లింలు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఆ వర్గానికి చెందిన బంకర్లను హామీలతో ఆకర్షిస్తోంది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ మైనార్టీల కోసం భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో నిర్వహించనున్న ఈ సభకు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. మరోవైపు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్ఘడ్లపై కాంగ్రెస్ మైనార్టీ డిపార్ట్మెంట్ దృష్టి సారించనుంది.