ఒడిశా రైలు ప్రమాద బాధితులకు సుకేశ్ చంద్రశేఖర్ రూ.10కోట్ల విరాళం..
X
మనీలాండరింగ్ కేసు నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ ఒడిశా రైలు ప్రమాద బాధితులకు భారీ విరాళాన్ని ప్రకటించాడు. రూ.10 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చాడు. ఈ మేరకు రైల్వే శాఖకు లేఖ రాశాడు. తన విరాళాన్ని తీసుకోవాలని రైల్వే శాఖ మంత్రిని కోరాడు. తను అందిస్తున్న డబ్బులకు ఆదాయపు పన్ను చెల్లించానని చెప్పాడు. విరాళాన్ని పంపేందుకు సంబంధిత విభాగ వివరాలను పంపాలని లేఖలో సుఖేష్ తెలిపాడు.
"ఒడిశా రైలు దుర్ఘటన నన్ను ఎంతగానో బాధించింది. ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. కానీ బాధ్యతగల పౌరుడిగా బాధితులకు సాయం చేయాలనుకుంటున్నాను. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల చదువులకు, కుటుంబాలను ఆదుకోవడానికి తన రూ.10 కోట్లు ఉపయోగపడతాయి" అని చెప్పాడు. ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న సుకేశ్.. అక్కడి నుంచే ఈ లేఖ పంపినట్లు తెలుస్తోంది.
ప్రముఖ ఫార్మా కంపెనీ రాన్‌బాక్సీ యజమాని శివిందర్ మోహన్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తానని అతని భార్య అదితి సింగ్ నుంచి 200 కోట్లు వసూలు చేశాడన్న కారణంతో సుకేశ్ జైలులో ఉన్నాడు. జైలు నుంచే లెటర్స్ విడుదల చేసి సంచలనం సృష్టిస్తున్నాడు. ఇటీవల అతడు ఆప్ మాజీ మంత్రి సత్యేందర్ జైన్, ఆమ్ ఆద్మీ పార్టీపై సంచలన ఆరోపణలు చేశాడు.