'ఆ దగ్గు మందుల్లో ఎలాంటి లోపం లేదు'.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ
X
భారత్కు చెందిన మెయిడెన్ ఫార్మా సంస్థ తయారు చేసిన దగ్గు మందుతో కిడ్నీలు దెబ్బతిని గాంబియాలో గతేడాది 70 మంది చిన్నారులు మరణించినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు నిజమేనని నమ్ముతూ భారత ప్రభుత్వంపై దావా వేసేందుకు గాంబియా సర్కారు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో గాంబియాలో చిన్నారుల మృతికి కారణమయ్యాయని ఆరోపించిన దగ్గు మందుల్లో ఎలాంటి లోపం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. ఆ మందులును వివిధ రకాలుగా తనిఖీలు నిర్వహించి.. ఆ పరీక్షలన్నింటిలోనూ ఎలాంటి లోపాలు వెలుగు చూడలేదని ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. గాంబియా ప్రభుత్వం సంప్రదిస్తే మా నివేదిక ప్రకారం బదులిస్తామని వెల్లడించారు.
అయితే హరియాణా నుంచి ఔషధాలను సరఫరా చేసిన రెండు భారతీయ సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు యూఎస్ న్యాయ సంస్థను సంప్రదిస్తున్నట్లు గాంబియా ప్రభుత్వం శుక్రవారం పేర్కొంది. గతేడాది గాంబియాలో మూత్రపిండాల వైఫల్యంతో సుమారు 70 మంది చిన్నారులు మరణించారు. భారత్లో తయారైన కలుషిత ఔషధాల వల్లే ఈ మరణాలు సంభవించాయనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ ద్వారా గాంబియాకు సరఫరా చేస్తున్న దగ్గు మందుల్లో నాణ్యత లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సైతం హెచ్చరించింది. మార్చిలో యూఎస్ సీడీసీ, గాంబియన్ ఆరోగ్యశాఖ అధికారులు జరిపిన పరిశోధనలో మరణాలకు, దగ్గు మందుకు సంబంధం ఉన్నట్లు తెలిసింది. డైఇథలిన్ గ్లైకాల్ (డీఈజీ), ఇథలిన్ గ్లైకాల్తో (ఈజీ) ఔషధాలు కలుషితమైనట్లు సీడీసీ తెలిపింది.