గుజరాత్లో వరదలు..900 గ్రామాలకు కరెంట్ కట్..
X
బిపోర్‌జాయ్ తుపాను గుజరాత్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. తీరం దాటే సమయంలో సముద్రంలో అల్లకల్లోలం సృస్టించింది. తుపాను ప్రభావంతో తీర ప్రాంతాలు భయానకంగా మారాయి. ఆకస్మిక వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలు , ఈదురుగాలుల ప్రభావంతో విద్యుత్ స్తంభాలు కూలి దాదాపు 900లకు పైగా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాను ప్రభావంతో అటు రాజస్థాన్‌తో పాటు ముంబైలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్ తుపాను గురువారం అర్ధరాత్రి సమయంలో గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో తీరాన్ని దాటింది. ప్రస్తుతం ఈశాన్య దిశగా కరాచీ వైపు బిపోర్‌జాయ్ తుపాను కదులుతోంది. శుక్రవారం సాయంత్రానికి ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తుపాను తీరాన్ని దాటే సమయంలో గుజరాత్‌ను వణికించింది. కచ్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 140 కి.మీల వేగంతో వీచిన భీకరమైన ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో వందలాది మంది ప్రజలు కరెంటు లేక చీకట్లో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఆకస్మిక వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గృహాలు, ఆస్పత్రుల్లోకి వరదు నీరు చేరింది. 940 గ్రామాలకు కరెంటు నిలిచిపోయింది. పలు రైళ్లు రద్దయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అక్కడి పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యవేక్షిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో మోదీ ఫోన్లో మాట్లాడారు. తుపాను పరిస్థితుల గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో గిర్ అడవుల్లోని వణ్యప్రాణుల భద్రతపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామని, సహాయక చర్యలను కేంద్రం చేపడుతుందని ప్రధాని హామీ ఇచ్చారు.
#WATCH | Gujarat: Waterlogging witnessed in several areas of Bhuj after cyclone 'Biparjoy' made landfall along the Gujarat coast yesterday pic.twitter.com/Vzwqq1T8Kf
— ANI (@ANI) June 16, 2023