బిపోర్జాయ్ ఎఫెక్ట్.. రాజస్థాన్లో 2 జిల్లాలకు రెడ్ అలర్ట్
X
గుజరాత్ను వణికించిన బిపోర్జాయ్ తుఫాను బలహీనపడింది. అల్పపీడనంగా మారి ఈశాన్య దిశవైపు ప్రయాణిస్తూ రాజస్థాన్ పై ప్రభావం చూపుతోంది. బిపర్ జోయ్ కారణంగా రాజస్థఆన్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జలోర్, బార్మర్ జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తుండటంతో అధికారులు ఆ రెండు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంత ప్రజల కోసం సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. వర్షాల కారణంగా 14 రైళ్లు రద్దయ్యాయి.
రాజస్థాన్పై వరుణుడి ప్రతాపం
ప్రస్తుతం బిపోర్జాయ్ తుఫాను రాజస్థాన్ లోని జోథ్‌పూర్, జైసల్మేర్, పాలీ, సిరోహీ వైపు పయనిస్తోందని వాతావరణ శాఖ చెప్పింది. దాని ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుఫాను నేపథ్యంలో అప్రమత్తమైన రాజస్థాన్ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా జైపూర్, కోట, భరత్‌పూర్, ఉదయ్‌పూర్, అజ్మీర్, జోద్‌పూర్, బికనేర్ తదితర ప్రాంతాలకు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పంపింది.
తప్పిన ప్రాణ నష్టం
బిపోర్జాయ్ తుఫాను అల్పపీడనంగా మారక ముందు గుజరాత్ లోని కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించింది. తీర ప్రాంతాల్లో కల్లోలం సృష్టించింది. అయితే తుఫాను కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. అయితే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 23 మంది గాయపడ్డట్లు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లక్ష మందికిపైగా జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణ నష్టం తప్పిందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే కుండపోత వర్షాల కారణంగా భారీగా ఆస్తినష్టం జరిగి ఉంటుందని దానిపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని అధికారులు అంటున్నారు.
చీకట్లోనే వెయ్యి గ్రామాలు
ఇదిలా ఉంటే భారీ వర్షాలు, ఈదురు గాలులకు 500 ఇండ్లు దెబ్బతినగా 800 చెట్లు కూలిపోయాయి. కచ్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్, మోర్బీ, జునాగఢ్, గిర్ సోమనాథ్, రాజ్‌కోట్, పోర్‌బందర్ తదితర జిల్లాల్లో తుపాను వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం వెయ్యికిపైగా గ్రామాలు ఇంకా కరెంటు లేక చీకట్లోనే మగ్గుతున్నాయి. 8 జిల్లాల్లో విద్యుత్ సరఫరా పునరుద్దరణకు వెయ్యికిపైగా బృందాలను రంగంలోకి దింపినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీలైనంత తొందరగా కరెంటు సరఫరా పునరుద్దరించనున్నట్లు చెప్పింది.