బంగాళాఖాతంలో తుఫాను.. తెలంగాణ, ఏపీలో వర్షాలు
X
బంగాళాఖాతంలో డిసెంబర్ 1న తుఫాన్ ఏర్పడనుంది. దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీకి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. అనంతరం వాయవ్య దిశగా కదిలి 48 గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
డిసెంబర్ 1 నాటికి మరింత బలపడనున్న తుఫాన్.. ఉత్తర ఈశాన్య దిశగా పయనించి డిసెంబర్ 4కల్లా తీవ్ర తుఫానుగా బలపడుతుంది. 5న ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీరందాటుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం దాటిన తరువాత తీవ్ర తుఫాన్ బలహీనపడుతుందని చెప్పింది. తుఫాను ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముంది. హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాను ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.