Home > జాతీయం > Cyclone Michaung : దిశ మార్చుకున్న మిచాంగ్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Cyclone Michaung : దిశ మార్చుకున్న మిచాంగ్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Cyclone Michaung  :  దిశ మార్చుకున్న మిచాంగ్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
X

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మిచౌంగ్ తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలతో ముంచెత్తుతోంది. తుఫాన్ దిశను మార్చుకోవడంతో నిన్న అర్దరాత్రి 12 గంటల సమయంలో నెల్లూరు కి సమీపంలో గంటకు 110km పరిభ్రమణ వేగం, గంటకు 8km గమన వేగంతోతీరం దాటింది. పరిభ్రమణ వేగం ఎక్కువగా వుండి గమనం వేగం తక్కువగా ఉండడంతో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి 2.30 గంటలకు తుఫాన్ తీరం దాటింది. ప్రస్తుతం తుఫాన్ పూర్తిగా ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తుంది. కాబట్టి ఈ తుఫాను నెల్లూరు, ప్రకాశం, పల్నాడు మీదుగా బుధవారం తెల్లవారు జాముకి సూర్యాపేట మీదుగా తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశించే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాలతోపాటు, తెలంగాణలో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తుపాను ప్రభావం ఉత్తర తెలంగాణపై ఎక్కువగా ఉండనుంది. దీంతో రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్నారు అధికారులు. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. దీనికి తోడు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. భారీ వర్షాలకు తోడు ఈదురు గాలులతో రాష్ట్రంలో చలి తీవ్రత కూడా పెరిగే ఛాన్స్ ఉందని అన్నారు. అవసరమైతేనే బయటకు వెళ్లాలని.. వర్షాలపట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.




Updated : 5 Dec 2023 8:54 AM IST
Tags:    
Next Story
Share it
Top