Home > జాతీయం > Cyclone Michaung : మిచౌంగ్ తుఫాన్‌.. జలదిగ్బంధంలో చెన్నై నగరం

Cyclone Michaung : మిచౌంగ్ తుఫాన్‌.. జలదిగ్బంధంలో చెన్నై నగరం

Cyclone Michaung : మిచౌంగ్ తుఫాన్‌.. జలదిగ్బంధంలో చెన్నై నగరం
X

మిచౌంగ్ తుఫాన్‌ ప్రభావంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి చెన్నై (Chennai )లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.చెన్నై నగరంతోపాటు పొరుగున ఉన్న కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు సహా పలు జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో చెన్నై నగరంతోపాటు దాని పొరుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. దీంతో జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్తగా పాఠశాలలు, కళాశాలలు, వరద ప్రభావిత ప్రాంతాల్లోని కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. నగరంలోని కోర్టులకు సెలవు ఇచ్చినట్లు మద్రాస్‌ హైకోర్టు ప్రకటించింది. వీలైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు కోరారు.

ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందాలు చెన్నైలో మోహరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు నదులు, వాగులు ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి.దీంతో ప్రమాదకర స్థాయిని మించి నీరు ప్రవహిస్తున్న దృష్ట్యా బేసిన్‌ బ్రిడ్జ్‌ – వ్యాసర్పాడి మధ్య ఉన్న బ్రిడ్జి నెంబర్‌ 14ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వంతెన మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. చెన్నై – మైసూర్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, కోయంబత్తూరు – కోవై ఎక్స్‌ప్రెస్, కోయంబత్తూరు శతాబ్ది ఎక్స్‌ప్రెస్, కెఎస్‌ఆర్ బెంగళూరు ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్, కెఎస్‌ఆర్ బెంగళూరు బృందావన్ ఎక్స్‌ప్రెస్, తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లను సోమవారం రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. వీటితోపాటు మరికొన్ని రైళ్లను రాకపోకలను కూడా అధికారులు నిలిపివేశారు.

తుఫాన్ నేపథ్యంలో చెన్నైలోనీ ఎంటీసీ సంస్థ మొత్తం 2,800 బస్సుల్లో కేవలం 600 మాత్రమే తిప్పుతోంది. చాలా మంది సిబ్బంది విధులకు హాజరుకాలేదని అధికారులు వెల్లడించారు. దీంతో ప్రైవేటు వాహనాల్లో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కోయంబత్తూరు- చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. చాలా విమానాలను చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి మళ్లించారు. ఇప్పటి వరకు దాదాపు 11 విమానాలను దారి మళ్లించినట్లు సమాచారం.




Updated : 4 Dec 2023 11:34 AM IST
Tags:    
Next Story
Share it
Top