దళితుడి ముఖానికి మలం.. మళ్లీ అక్కడే
X
దళితులపై దారుణాలకు అంతూ పొంతూలేకుండా పోతోంది. చిన్న చిన్న కారణాలతో కొందరు, కులపిచ్చితో మరికొందరు అమానుషాలకు పాల్పడుతున్నారు. ఎన్ని చట్టాలు ఉన్నా, శిక్షలు పడకపోవడంతో పేట్రేగిపోతున్నారు. మధ్యప్రదేశ్‌లో పరిస్థితి రానురాను మరింత దిగజారుతోంది. గిరిజనుడిపై మూత్రం, దళితులపై దాడులు పెరిగిపోతున్న రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. తనకు గ్రీజు పూశాడని ఓ దళితుడికి తలకు, ముఖానికి మానవ మలం పులిమాడో దుర్మార్గుడు. చత్తర్‌పూర్ జిల్లా బౌకౌరా గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. బాధితుడు గ్రామపంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేయగా పెద్దలు అతనికే రూ. 600 జరిమానా విధించారు!
బాధితడు దశరథ్ అహిర్వార్ తెలిపిన వివరాల ప్రకారం.. అతడు శుక్రవారం డ్రెయిన్ పనులు చేస్తున్నాడు. అతని చేతికున్న గ్రీజు పొరపాటున వీధి పంపు వద్ద స్నానం చేస్తున్న రామ్‌కృపాల్ పటేల్ అనే బీసీ వ్యక్తికి తగిలింది. పటేల్ కోపం పట్టలేక దగ్గర్లో ఉన్న మానవ మనాన్ని మగ్గుతో తీసుకొచ్చి దశరథ్‌పై పడేశాడు. అంతేకాకుండా కులం పేరుతో దూషించాడు. దశరథ్ గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేయగా అతనిదే తప్పు అంటూ జరిమానా విధించారు. దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పటేల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పటేల్, దశరథ్ సరదాగా ఆటపట్టించుకుంటుండగా శ్రుతి తప్పి ఈ సంఘటన చోటు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు.