ఢిల్లీలో దీపావళి.. ఎనిమిదేళ్ల రికార్డులు బద్దలు
X
దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి వేడుకలు రికార్డులను బ్రేక్ చేసింది. నగరంలో రెండు రోజుల పాటు మెరుగుపడిన వాయు నాణ్యత సూచీ.. దీపావళి పండుగ కారణంగా అమాంతం పెరిగిపోయింది. టపాసులపై ప్రభుత్వం నిషేధాన్ని బేఖాతరు చేస్తూ ప్రజలు పండుగను జరుపుకున్నారు. భారీగా టపాసులు, మందుగుండ పేల్చడంతో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. నగరంలోని చాలా చోట్ల వాయు నాణ్యత సూచిక (AQI) 500పైగా నమోదుకాగా.. అక్కడక్కడ 900 వరకూ చేరడం గమనార్హం. సోమవారం ఉదయం 6 గంటలకు అత్యధికంగా లజ్‌పత్ నగర్ వద్ద 959 ఏక్యూఐ నమోదుకాగా.. తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వద్ద 910, కరోల్ బాగ్ వద్ద 779 నమోదయ్యింది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం ఢిల్లీలో గత ఏడాది దీపావళికి 312, 2021లో 382, 2020లో 414, 2019లో 337, 2018లో 281, 2017లో 319, 2016లో 431 ఏక్యూఐ నమోదైంది. కాగా శనివారం 24 గంటల సగటు AQI 220గా ఉంది, ఇది ఎనిమిదేళ్లలో దీపావళి ముందు రోజు కనిష్ట స్థాయిగా ఉంది.
గాల్లో వాయు నాణ్యత సూచీ 0-50గా ఉంటే ఉత్తమంగా.. 51 నుంచి 100గా ఉంటే సంతృప్తికరం.. 101-200 ఉంటే సాధారణం.. 201-300 ఉంటే తీవ్రం, 301- 400 ఉంటే చాలా తీవ్రం, 401-450 అతి తీవ్రం, 450 దాటితే అత్యంత తీవ్రంగా పరిగణిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఢిల్లీలో వాయు కాలుష్యం 80 నుంచి 100 శాతం అధికంగా ఉంది.