Indigo Airlines : ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. గాల్లోకి లేవగానే..
X
భువనేశ్వర్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలెట్ విమానాన్ని తిరిగి భువనేశ్వర్ ఎయిర్ పోర్టుకు మళ్లించాడు. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఇండిగో 6E2065 ఫ్లైట్ సోమవారం ఉదయం 7:50 గంటలకు ఢిల్లీ బయలుదేరింది. టేకాఫ్ అయిన 20-25 నిమిషాల తర్వాత విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో ఫ్లైట్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి భువనేశ్వర్ ఎయిర్ పోర్టుకు మళ్లించాడు. ఏటీసీ అధికారులకు సమాచారం ఇచ్చి అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ఘటన జరిగిన సమయంలో విమానంలో 180 మంది ప్యాసింజర్లు ఉన్నారు. వారంతా సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు ప్రకటించారు. అయితే పక్షి ఢీకొట్టడంతో ప్లైట్ లెఫ్ట్ ఇంజిన్ లో సమస్య తలెత్తింది. ఈ ఘటనకు సంబంధించి ఇండిగో ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.