CM Arvind Kejriwal : లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు సమన్లు
X
సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 17న కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫిర్యాదు మేరకు రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్కు ఈడీ ఇప్పటికి ఐదుసార్లు నోటీసులు జారీచేసింది. అయితే ఆయన మాత్రం విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. కేజ్రీవాల్ లిక్కర్ కేసు దర్యాప్తునకు ఏ మాత్రం సహకరించడంలేదని పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేసింది.
లిక్కర్ పాలసీ స్కాంకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు 2023 నవంబర్ 2న మొదటిసారి సమన్లు జారీచేసింది. అయితే మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్నందున కేజ్రీవాల్ విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో అదే ఏడాది డిసెంబర్ 21 విచారణకు రావాలని రెండోసారి నోటీసులివ్వగా విపస్యన మెడిటేషన్ సెంటర్ కు వెళ్తున్నందున రాలేనని చెప్పారు. ఈ ఏడాది జనవరి 3న మూడోసారి సమన్లు పంపగా.. రాజ్యసభ ఎలక్షన్లు, రిపబ్లిక్ డే నిర్వాహణ పనుల్లో బిజీగా ఉన్నానంటూ డుమ్మా కొట్టారు. నాల్గోసారి జనవరి 18 ఈడీ నోటీసులు ఇవ్వగా 3 రోజుల గోవా పర్యటనకు వెళ్లారు. చివరగా ఫిబ్రవరి 2న ఈడీ అధికారులు కేజ్రీవాల్కు నోటీసులు పంపగా.. చండీఘడ్ మేయర్ ఎన్నికకు సంబంధించి నిరసన ప్రదర్శనలో పాల్గొంటున్నందున విచారణకు హాజరుకాలేనని చెప్పారు.