స్టేజిపై మాట్లాడుతూ.. కన్నీరు పెట్టుకున్న ముఖ్యమంత్రి
X
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కన్నీరు పెట్టుకున్నారు. ఢిల్లీలోని దిరియాపూర్ గ్రామంలో జరిగిన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. విద్యాశాఖ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాను తలచుకుని ఏడ్చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన కేజ్రీవాల్.. విద్యారంగ అభ్యున్నతి కోసం సిసోడియా పడ్డ శ్రమ, ఆయన ఆలోచనలను గుర్తు చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన హయాంలో ఢిల్లీ విద్యారంగం ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేస్తూ కంటతడి పెట్టుకున్నారు.
ఢిల్లీలోని ప్రతీ విద్యార్థి నాణ్యమైన విద్యను పొందేందుకు సిసోడియా పరితపించే వారని.. ఢిల్లీ విద్యారంగాన్ని దేశంలో ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు సిసోడియా పాటుపడ్డారని కేజ్రీవాల్ అన్నారు. కానీ, బీజేపీ అతన్ని అక్రమ కేసుల్లో ఇరికించి జైలు పాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎంతో మంది క్రిమినల్స్ ఉన్నా.. సిసోడియా లాంటి మంచి వ్యక్తిని జైల్లో వేశారని కేంద్రాన్ని విమర్శించారు కేజ్రీవాల్.