Home > జాతీయం > రెజ్లర్ల కేసు.. బ్రిజ్ భూషణ్‌కు మధ్యంతర బెయిల్..

రెజ్లర్ల కేసు.. బ్రిజ్ భూషణ్‌కు మధ్యంతర బెయిల్..

రెజ్లర్ల కేసు.. బ్రిజ్ భూషణ్‌కు మధ్యంతర బెయిల్..
X

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్కు కోర్టులో ఊరట దక్కింది. ఈ కేసులో బ్రిజ్ భూషణ్కు రౌస్ అవెన్యూ కోర్టు రెండు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అతడికి సాయం చేసినట్లు ఆరోపణలు ఉన్న డబ్ల్యూఎఫ్‌ఐ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌కు కూడా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా వారిని 25వేల పూచీకత్తు సమర్పించాలని సూచించింది.

ఇక బ్రిజ్‌ భూషణ్ రెగ్యులర్ బెయిల్‌కు సంబంధించి తదుపరి వాదనలను జూలై 20కి వాయిదా వేసింది. ఇక రెజ్లర్లపై లైంగిక వేధింపు ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు జూన్ 15న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఐపీసీలోని సెక్షన్‌లు 354, 354A, 354D, 506 కింద ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఆరుగురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు, దాడి, వెంబడించడం వంటి ఆరోపణలపై 1500 పేజీల ఛార్జిషీట్‌ను ఢిల్లీ పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ ఛార్జిషీట్‌లో ఆరుగురు రెజ్లర్ల వాంగ్మూలాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఫోటోగ్రాఫ్‌లు, వీడియోలు, కాల్ వివరాల రికార్డుల వంటి సాంకేతిక ఆధారాలు ఉన్నాయి.

రెజ్లర్లు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో బ్రిజ్‌ భూషణ్‌పై కేసు నమోదు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు దిగివచ్చారు. జూన్‌ 2న పలు సెక్షన్ల కింద బీజేపీ ఎంపీపై కేసులు నమోదు చేశారు. ఆయనపై నమోదైన ఆరు కేసుల్లో 108 మందిని విచారించినట్లు తెలిపారు. దీంతో గత వారం ఢిల్లీ కోర్టు బ్రిజ్ భూషణ్ కు సమన్లు జారీ చేసింది. ఇవాళ కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించడంతో బ్రిజ్ భూషణ్ విచారణకు హాజరయ్యారు.


Updated : 18 July 2023 6:56 PM IST
Tags:    
Next Story
Share it
Top