వరద బాధితలుకు రూ.10 వేలు సాయం, సీఎం ప్రకటన..
X
భారీ వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీ నీటి మునిగింది. తగ్గినట్టే తగ్గి మళ్లీ భారీ వర్షాలు కురవడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. యమునా నది నీరు ప్రమాద స్థాయికి మించి ప్రవహించిడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యమునా నది సమీపంలో నివసిస్తున్న అనేక పేద కుటుంబాలకు అపార నష్టం కలిగింది. బాధితులను సహాయక శిబిరాలకు తరలించారు.
యమునా నది సరిహద్దు ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు జూలై 17 మరియు 18 తేదీలలో సెలవులు ప్రకటించారు. వరద బాధిత పాఠశాలలన్నీ ఆన్‌లైన్ తరగతులను ఏర్పాటు చేసుకోవచ్చని డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలిపింది.
రూ.10 వేలు సాయం..
ఉత్తర ఢిల్లీలోని మోరీ గేట్‌లోని సహాయ శిబిరాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సందర్శించారు. అనంతరం కీలక ప్రకటన చేశారు. వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10,000 అందజేస్తుందని తెలిపారు. ఈమేరకు కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేశారు. ‘యమునా నది సమీపంలో నివసిస్తున్న అనేక పేద కుటుంబాలు భారీ నష్టాన్ని చవి చూశాయి. కొన్ని కుటుంబాలు తమ ఇళ్లలోని అన్ని వస్తువులను కోల్పోయాయి. ఆర్థిక సహాయంలో భాగంగా ప్రతి కుటుంబానికి రూ.10,000 పరిహారం అందజేస్తాం’ అని ట్వీట్ చేశారు.
వరదల వల్ల ఆధార్ కార్డు వంటి ముఖ్యమైన పత్రాలు కోల్పోయిన వారి కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అలాగే స్కూల్ యూనిఫారాలు, పుస్తకాలు కోల్పోయిన విద్యార్థులకు వాటిని అందజేస్తామని చెప్పారు. ఢిల్లీలో జనజీవనం త్వరలో సాధారణ స్థితికి వస్తుందని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.