WhatsApp-Based Bus Tickets: ఇక వాట్సాప్లోనే బస్సు టికెట్లు
X
సిటీ బస్సుల్లో ప్రయాణం అంటే కత్తి మీద సామే అని చెప్పాలి. ప్రయాణికుల రద్దీలో కండక్టర్ టికెట్ తీసుకోవడం మరో పెద్ద సాహసం. అంత రద్దీలో టికెట్ తీసుకోవడం మిస్ అయితే.. పొరపాటున చెకింగ్ జరిగితే ఇక అంతే. ఫైన్ కట్టడమో.. అధికారుల చేతిలో తిట్లు తినడమో జరుగుతుంది. ఈ అసౌకర్యాన్ని తగ్గించేందుకు మెట్రోల్లో వాట్సాప్ ద్వారా టికెట్లు జారీ చేస్తున్నారు. ఇప్పుడు అదే అంశాన్ని బస్సుల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఢిల్లీ ప్రభుత్వం. మెట్రో వాట్సాప్ టికెట్ తరహాలోనే.. బస్సుల్లో కూడా వాట్సాప్ ద్వారా టికెట్లు జారీ చేసే అంశాన్ని అధ్యయనం చేస్తుంది.
త్వరలో దీనిపై ప్రయాణికులకు శుభవార్త చెప్తామని ఢిల్లీ ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇటీవల ఢిల్లీ మెట్రోలో ప్రారంభమైన వాట్సాప్ టికెట్ కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చింది. వాట్సాప్ టికెట్ పొందాలంటే.. వాట్సాప్ లో ఒక నెంబర్ కు హాయ్ అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. లేదా మెట్రో స్టేషన్ ల్లో ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి టికెట్ పొందొచ్చు. అయితే వాట్సాప్ ద్వారా పొందిన టికెట్ ను క్యాన్సిల్ చేసే అవకాశం లేదు. అలాగే క్రెడిట్, డెబిట్ కార్డ్స్ తో పేమెంట్ చేస్తే.. చిన్న మొత్తంలో కన్వీనియెన్స్ ఫీజు కూడా వసూలు చేస్తారు. యూపీఐ ఆధారిత పేమెంట్స్‌కు మాత్రం ఎలాంటి అదనపు రుసుము ఉండదు.