కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్.. అరెస్ట్పై క్లారిటీ
X
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. లిక్కర్ స్కాం కేసులో ఈడీ సమన్లను సవాల్ చేస్తూ.. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఆయనకు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వలేమన్న ధర్మాసనం.. తదుపరి విచారణ ఏప్రిల్ 22 కి వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు ఇప్పటి వరకు తొమ్మిది సార్లు నోటీసులు జారీ చేశారు. కానీ ఈడీ సమన్లను కేజ్రీవాల్ మొదట్నుంచీ పట్టించుకోవడం లేదు. తొమ్మిదోసారి కూడా విచారణకు గైర్హాజరు కాగా.. ఎక్కడ తనను ఈడీ కచ్చితంగా అరెస్ట్ చేస్తుందన్న అనుమానంతో ఉదయం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ విచారణకు సిద్ధమని.. అయితే అరెస్ట్ కాకుండా తనకు రక్షణ కల్పించాలని అందులో కోరారు.
మరోవైపు ఈడీ తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్లు కేజ్రీవాల్ ను విచారణ నిమిత్తమే పిలుస్తున్నామని, అరెస్ట్ చేయడానికి పిలవడం లేదని కోర్టుకు చెప్పారు. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది మాత్రం కచ్చితంగా చెప్పలేమని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కావడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.