ఒమర్ అబ్దుల్లా విడాకుల పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
X
నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విడాకుల పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. భార్య పాయల్ అబ్ధుల్లా నుంచి విడాకుల కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. ఒమర్ అబ్దుల్లా డైవోర్స్ పిటిషన్‌ను కొట్టేస్తూ గతంలో ఫ్యామిలీ కోర్టు వెలువరించిన తీర్పు సరైనదేనని హైకోర్టు అభిప్రాయపడింది. ఒమర్‌పై ఆయన భార్య ఎలాంటి క్రూరత్వం చూపలేదని, అందుకే విడాకులు మంజూరు చేయడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది.
తన భార్య పాయల్ తనపట్ల క్రూరంగా వ్యవహరిస్తోందంటూ ఒమర్ అబ్దుల్లా ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ వేశారు. అయితే అందులో ఆమె క్రూరత్వానికి సంబంధించిన సాక్ష్యాలు స్పష్టంగా లేవు. ఆయన చేసిన ఆరోపణలు నిరూపించలోకపోవడంతో ఫ్యామిలీ కోర్టు విడాకుల పిటిషన్ కొట్టివేసింది. దీంతో కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన అప్పీల్ పిటిషన్‌లో ఎలాంటి మెరిట్స్ లేనందున దాన్ని డిస్మిస్ చేస్తున్నట్లు జస్టిస్ సంజీవ్ సచ్‌దేవ, జస్టిస్ వికాస్ మహాజన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఇదిలా ఉంటే ప్రేమ వివాహం చేసుకున్న ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ గొడవల కారణంగా కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఒమర్ విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. పాయల్ అబ్దుల్లా.. రాజస్థాన్ కాంగ్రెస్ అగ్రనేత సచిన్ పైలట్ సోదరి.