డేంజర్ జోన్ దాటి ప్రవహిస్తున్న యమునా నది..ఢిల్లీ హై అలర్ట్
X
ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తల్లడిల్లుతున్నారు. వరుణుడి ఉగ్రరూపంతో ఉత్తరాదిలోని చాలా రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న కుంభవృష్టికి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. వర్షాల ధాటికి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. మౌలిక సదుపాయలకు, సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సుమారు రూ.785 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది డేంజర్ జోన్ దాటి మరీ ప్రవహిస్తోంది. తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. హర్యానా నుంచి వరది నీరు పోటెత్తుతుండటంతో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. పాత ఢిల్లీ రైల్వే బ్రిడ్జ్ దగ్గ యమునా నది నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. 207.49 మీటర్ల ఎత్తులో రైల్వే బ్రిడ్జ్‌ని
తాకుతూ ప్రవహిస్తోంది. యమునా ఉగ్రరూపం దాల్చడంతో ఢిల్లీ సర్కార్ అప్రమత్తమైంది. నదీ పరిసరాల్లో నివసించే వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రత్యేకంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ఆహారం, తాగునీరు అందిస్తోంది. వలస కార్మికులు, వ్యవసాయ కూలీలకు సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు, ఎన్జీఓలు ప్రజలకు సహాయం అందిస్తున్నారు. యమునా నది ఉగ్రరూపాన్ని చూసి ప్రజలు భయపడిపోతున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ వరద పర్యవేక్షణ పోర్టల్ ప్రకారం, యమున నది నీటి మట్టం రికార్డు స్థాయికి చేరుకుంది.