లిక్కర్ స్కామ్‌లో అలజడి.. అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి
X
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కీలక మలుపు తిరిగింది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అరబిందో ఫార్మా డైరెక్టర్, ఎంపీ విజయసాయి బంధువు పెన్నాక శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారాడు. స్కామ్ ఎలా జరిగిందో అన్నీ విడమరచి చెబుతానని ఢిల్లీ రౌస్ అవెన్యూ లోని సీబీఐ కోర్టు బుధవరాం చెప్పాడు. దీనికి కోర్టు అంగీకరించింది. దీంతో ఇతర నిందితుల్లో గాబరా మొదలైంది. శరత్ స్కామ్ వివరాను బయటపెడితే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశముంది.
ఈ కేసులో అరెస్టయి జైలుకెళ్లిన శరత్ చంద్రారెడ్డి ప్రస్తుతం బెయిల్‌పై బయట తిరుగుతున్నాడు. భార్య కనికా రెడ్డికి ఒంట్లో బాగలేదని చెప్పి బెయిల్ తెచ్చుకున్న ఆయన శిక్ష తప్పించుకోవడానికి విచారణకు సహకరిస్తారని ఇదివరకే వార్తలు వచ్చాయి. ఢిల్లీ మద్యం లైసెన్సుల్లో 30 శాతం శరత్ చంద్రారెడ్డి దక్కించుకున్నాడు. సౌత్ గ్రూపు పేరుతో దందాకు తెరతీసిన సిండికేట్లో అతనిది ప్రధాన పాత్ర అని, ఆప్‌కు వంద కోట్లు ముడుపులు చెల్లింపులో భాగస్వామి అని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. శరత్ చంద్రారెడ్డి వైకాపా రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి దగ్గరి బంధువు. విజయసాయి రెడ్డి సొంత అల్లుడు రోహిత్ రెడ్డికి స్వయానా తమ్ముడు. శరత్ చంద్రారెడ్డిని కేసు నుంచి తప్పించడానికి వైకాపా వైపు నుంచి కేంద్రంలో లాబీయింగ్ జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. అవినాశ్ రెడ్డితోపాటు అతణ్ని కూడా తప్పించడానికి వైకాపా నేతలు కేంద్ర మంత్రి అమిత్ షాతో చర్చలు జరుపుతున్నారని విమర్శలు వస్తున్నాయి. కాగా, ఈ కేసులో కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు కూడా అప్రూవర్‌గా మారి తర్వాత మాట మార్చారు.