చలిగా ఉందని కుంపటి వెలిగించాడు.. తెల్లారేసరికి..
X
ఉత్తరాదిని చలి వణికిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో దాని నుంచి ఉపశమనం కోసం కొందరు రూం హీటర్లు వాడుతున్నారు. మరికొందరు చలి మంటలు వేసుకుంటున్నారు. అయితే బెడ్రూంలో వెచ్చదనం కోసం ఓ వ్యక్తి చేసిన పని అతని ప్రాణాలు తీసింది. హృదయవిదారకమైన ఈ ఘటన న్యూ మంగళగిరిలో చోటు చేసుకుంది.
అంగన్‌వాడీ వాలీ గల్లీ ప్రాంతానికి చెందిన వినయ్ అరోరా బౌనర్స్‌గా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి చలి తీవ్రత ఎక్కువ కావడంతో బెడ్రూంలో చిన్న బొగ్గుల పొయ్యిలో నిప్పు ఏర్పాటు చేసుకున్నాడు. చలి కాచుకుంటూ అలాగే పొయ్యి పక్కనే నిద్రపోయాడు. అయితే అర్థరాత్రి దాటాక ప్రమాదవశాత్తు బొగ్గుల నుంచి మంటలు రావడంతో పక్కనే ఉన్న అతడి దుప్పటికి అంటుకున్నాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు వ్యాపించడంతో సదరు వ్యక్తి కాలిపోయాడు. నిద్రలోనే ప్రాణాలు విడిచాడు.
ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రూం లోపలి వైపు నుంచి గడియ పెట్టి ఉండడంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. నేలపై పడి పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.