తల్లిపై కోపం..ఇంట్లో నగలు డబ్బు ఎత్తుకెళ్లిన కూతురు.. ఆ తర్వాత..
X
ఆ తల్లికి పెద్ద కూతురు కంటే చిన్నకూతురు పైనే ప్రేమ ఎక్కువ. దీంతో పెద్ద కూతురుకు అసూయ కలిగింది. పైగా తనకు కొన్ని అప్పులు కూడా ఉన్నాయి. దీంతో తల్లి ఇంటికే కన్నం వేయాలని నిర్ణయించుకుంది. చెల్లి పెళ్లి కోసం దాచిన డబ్బు, నగలును తెలివిగా కొట్టేసింది. వాటిని అమ్మేసి తన అవసరాలు తీర్చుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూపీ లాగితే డొంకంతా కదిలింది. సదరు మహిళను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.
ఢిల్లీ ఉత్తమ్‌నగర్‌లోని సేవక్ పార్క్ ప్రాంతంలో కమ్లేష్ అనే మహిళకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్దకూతురు శ్వేత వేరే చోట ఉంటుంది. అయితే తల్లికి తనకంటే తన చెల్లిపైనే ఎక్కువ ప్రేమ ఉందని.. తనను పట్టించుకోవడం లేదని శ్వేత అసూయతో రగిలిపోయింది. ఈ క్రమంలో చోరీ కుట్రకు తెరదీసింది. తన తల్లి ఇంట్లో లేని సమయంలో డూప్లికేట్ కీతో ఇంట్లోకి వెళ్లి.. తన చెల్లి పెళ్లికి దాచిన బంగారం, డబ్బును ఎత్తుకెళ్లింది. ఇక కమలేష్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అన్నీ కోణాల్లో విచారణ చేపట్టారు.
కమ్లేష్ ఇంట్లో పోలీసులకు ఏదీ అనుమానస్పదంగా కన్పించలేదు. తాళాలు కూడా పగలగొట్టలేకపోవడంతో ఇంట్లోవాళ్లే ఈ చోరీకి పాల్పడ్డట్లు అనుమానించి ఆ దిశలో దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ పుటేజీ పరిశీలించిన పోలీసులు.. ఓ బురఖా ధరించిన మహిళ ఇంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె కమలేష్ పెద్ద కూతురు అని గుర్తించిన పోలీసులు అవాక్కయ్యారు. తల్లి తనకంటే తన చెల్లినే ఎక్కువ ప్రేమగా చూడడంతో పాటు కొన్ని అప్పులు కూడా ఉండడంతో శ్వేత చోరీకి పడ్డట్లు పోలీసులు తెలిపారు.