బుల్డోజర్‌తో రోడ్డును తవ్వేసిన BJP ఎమ్మెల్యే అనుచరులు!!
X
బుల్డోజర్ గవర్నమెంట్‌గా వార్తల్లోకెక్కిన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోఓ ఆశ్చర్యపరిచే ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు వేసిన కాంట్రాక్టర్.. స్థానిక ఎమ్మెల్యేకు కమీషన్(goonda tax) ఇవ్వలేదని, ఆ ఎమ్మెల్యే అనుచరులు బుల్డోజర్‌తో రోడ్డునే తవ్వేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌నే కాదు.. ఇప్పుడు దేశవ్యాప్తంగానూ చర్చనీయాంశమైంది. కాంట్రాక్టర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు, ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath).. రోడ్డు తవ్విన వారినుంచే ఆ నష్టాన్ని రికవరీ చేయాలని ఆదేశించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్- బుదౌన్‌ల మధ్య పీడబ్ల్యూడీ విభాగం ఇటీవల రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఈ క్రమంలో.. సదరు కాంట్రాక్టరును ‘కమీషన్’ ఇవ్వాలని కొంతమంది డిమాండు చేశారు. స్థానిక కాట్రా నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అనుచరులమని చెప్పిన దుండగులు.. 5 శాతం కమీషన్ ఇవ్వాలని అడిగారట. ఇందుకు కాంట్రాక్టర్ నిరాకరించడంతో ఆగ్రహించిన ఆ దుండగులు.. రోడ్డు వేస్తున్న కార్మికులపై దాడి చేశారు. అనంతరం ఈ నెల (అక్టోబర్) 2న బుల్డోజర్‌తో 3 కిలోమీటర్ల వరకు కొత్తగా నిర్మించిన రోడ్డును ధ్వంసం చేసినట్లు.. కాంట్రాక్టర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని.. నిందితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
ఈ వ్యవహారం యూపీతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. దీనిపై స్థానిక BJP ఎమ్మెల్యే వీర్ విక్రమ్ సింగ్ స్పందించారు. ఈ కేసులో నిందితుడు తన అనుచరుడు కాదని.. అయితే, అతడు బీజేపీ కార్యకర్తే అని అంగీకరించారు. అయినప్పటికీ అతడితో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ దృష్టికి వెళ్లిందని.. రోడ్డు తవ్వేసిన వారినుంచే నష్టాన్ని రికవరీ చేయాలని ఆదేశించినట్లు ఉన్నతాధికారులు చెప్పారు.