D. K. Shivakumar : సీబీఐ నోటీసులపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రియాక్షన్
X
కేరళకు చెందిన ‘జైహింద్ టీవీ ఛానల్’లో పెట్టుబడుల వ్యవహారంలో కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. విచారణ కోసం ఈ నెల 11న ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలని పేర్కొంది. ‘జైహింద్ టీవీ’లో పెట్టుబడులు, వాటాల వివరాలు తెలపాలని కోరింది. ఈ కేసులో శివకుమార్, ఆయన భార్య ఉషతో పాటు మరో 30 మందికి కూడా సీబీఐ నోటీసులు పంపించింది
ఈ నోటీసులపై డీకే శివకుమార్ స్పందిస్తూ.. సీబీఐ తనను అరెస్ట్ చేయాలని అనుకుంటే అందుకు తాను సిద్ధమేనని చెప్పారు. తన సంస్థ వద్ద అన్ని పత్రాలు ఉన్నా.. నోటీసులు ఎలా జారీ చేస్తున్నారో తెలియడం లేదని అన్నారు. ఇదంతా తనను ఇబ్బంది పెట్టడానికేనని తనకు తెలుసన్నారు. ‘నాపై ఆరోపణలు చేసిన బీజేపీ నేతలు కొందరు నన్ను జైలుకు పంపుతామని అన్నారు. నాపై చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలతో చర్చకు రావాలంటూ వారిని సవాల్ చేశాను. అయితే, వారు చర్చలకు ముందుకు రాలేదు. రాజకీయంగా నన్ను అంతం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు’ అని ఆయన చెప్పారు. ఈ కేసులో విచారణ దాదాపుగా 90 శాతం పూర్తయిందంటూ సీబీఐ అధికారులు ప్రకటించడంపైనా డీకే సందేహం వ్యక్తం చేశారు.
కాగా డీకే శివకుమార్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2013-18 మధ్యకాలంలో ఆయన ఆదాయం లెక్కకు మించి ఉందని 2020లో సీబీఐ కేసు నమోదు చేసింది. పలు అవినీతి ఆరోపణలు, ఢిల్లీలోని ఫ్లాట్‌లో రూ.8 కోట్ల నగదు పట్టుబడిన వ్యవహారంలో సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులను ఆయన ఎదుర్కొంటున్నారు.