అయోధ్య రామాలయానికి విరాళాలు ఎన్ని వచ్చాయో తెలుసా ?
X
యూపీలోని అయోధ్య రామ మందిరానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1 వరకు దాదాపు 25లక్షల మంది భక్తులు రామయ్యను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు . ఇదే సమయంలో ఆలయ హుండీకి రూ.11 కోట్ల మేర విరాళాలు వచ్చినట్లు చెప్పారు. స్వామివారు కూర్చునే గర్భగుడి ముందు దర్శన మార్గం సమీపంలో నాలుగు పెద్ద సైజు విరాళాల హుండీలను ఉంచామని ట్రస్ట్ కార్యాలయ ఇన్చార్జి ప్రకాశ్ గుప్తా తెలిపారు. వీటితో పాటు 10 కంప్యూటరైజ్డ్ కౌంటర్లలో విరాళాలు అందుతున్నాయని తెలిపారు. ఈ విరాళాల కౌంటర్లలో టెంపుల్ ట్రస్ట్ ఉద్యోగులను నియమిస్తారు. వారు సాయంత్రం కౌంటర్ మూసివేసిన తర్వాత ట్రస్ట్ కార్యాలయంలో విరాళం మొత్తాన్ని సమర్పిస్తారు.11 మంది బ్యాంకు ఉద్యోగులు, ముగ్గురు టెంపుల్ ట్రస్ట్ ఉద్యోగులు సహా 14 మంది ఉద్యోగుల బృందం నాలుగు విరాళాల పెట్టెల్లో కానుకలను లెక్కిస్తోంది.
విరాళం మొత్తాన్ని జమ చేయడం నుంచి లెక్కించడం వరకు ప్రతిదీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుందని గుప్తా వెల్లడించారు.అయోధ్య రామమందిరం ఆవరణలో దాదాపు ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేసిన బిజోలియా రాళ్లపై వాతావరణం ఎలా ఉన్నా భక్తులు హాయిగా నడవగలుగుతారని నిపుణులు తెలిపారు. ఈ ప్రాంతం పరిక్రమ ప్రాంతం, కుబేర్ తిలాను కవర్ చేస్తుంది. రామ్ లల్లా దర్శనం కోసం ప్రతిరోజూ 2 లక్షల మందికి పైగా భక్తులు రామ మందిరానికి వస్తున్నారని గుప్తా చెప్పారు. భారీసంఖ్యలో వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అయోధ్యలోని బాలక్ రామ్ మందిరంలో స్వామి దర్శన సమయాన్ని ఆలయ నిర్వాహకులు ఇటీవల పొడిగించారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోవచ్చని అధికారులు వెల్లడించారు. అంతకుముందు ఆలయ దర్శన వేళలు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే ఉండేవి.