వీధి కుక్క అడ్డురావడంతో వెనక్కొచ్చేసిన 'విస్తారా' విమానం
X
ఎయిర్‌పోర్ట్ రన్‌వేపైకి వీధి కుక్క రావడంతో విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ ల్యాండ్ అవ్వకుండానే వెనుదిరిగింది. సోమవారం మధ్యాహ్నం గోవాలోని దబోలిమ్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూకే 881 ఫ్లైట్ కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం మధ్యాహ్నం 12:55 గంటలకు బయలుదేరింది. మధ్యాహ్నం 2 గంటలకు గోవాలోని దబోలిమ్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది.
అయితే ల్యాండ్ కావడానికి కొద్దిసేపు ముందు రన్‌వేపై వీధి కుక్కను గుర్తించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్.. వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు. ప్రమాదమని తెలిసి కాసేపు ల్యాండ్ చేయకుండా పైలట్‌ను ఆపినట్లు గోవా ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎస్‌వీటీ ధనుంజయరావు తెలిపారు. ల్యాండ్ అవ్వడం కష్టతరమైన పరిస్థితుల్లో విమానాన్ని తిరిగి బెంగళూరుకు మళ్లించారు. గంట తర్వాత 3:05 గం.ల సమయంలో విమానం కెంపెగౌడ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. మళ్లీ బెంగళూరు నుంచి 4:55 గంటలకు బయలుదేరి 6:15 గంటలకు సురక్షితంగా గోవాకు చేరుకుందని ఎస్‌వీటీ ధనుంజయరావు వివరించారు. ఆ సమయంలో విమానంలో 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు.