పాక్ దొంగదాని వలలో చిక్కుకుని.. కక్కేసిన భారత సైంటిస్ట్
X
డీఆర్డీవో సైంటిస్ట్ ప్రదీప్ కురుల్కర్ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. హనీ ట్రాప్కు గురై పాక్ ఏజెంట్కు రహస్య సమాచారం చెప్పాడనే ఆరోపణలపై ఆయన గత మేలో అరెస్ట్ అయ్యాడు. ఈ క్రమంలో మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 1800 పేజీల ఛార్జ్షీట్లో కీలక విషయాలను ఏటీఎస్ ప్రస్తావించింది. వలపు వలలో చిక్కుకున్న ప్రదీప్ కురుల్కర్.. కీలక సమాచారాన్ని ఆ ఏజెంట్తో పంచుకున్నట్లు ఏటీఎస్ స్పష్టం చేసింది.
‘‘ప్రదీప్ కురుల్కర్.. మహారాష్ట్రలోని పుణెలో డీఆర్‌డీవో ల్యాబ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు గతేడాది జారా దాస్‌గుప్తా పేరుతో ఓ మహిళ పరిచయమైంది. తానో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని యూకేలో పనిచేస్తున్నానని చెప్పింది. ఆ తర్వాత ఆయనకు అశ్లీల వీడియోలు, మెసేజ్‌లు పంపి స్నేహం పెంచుకుంది. వీరిద్దరూ వాట్సాప్‌లో వాయిస్, వీడియో కాల్స్ చేసుకున్నారు’’ అని ఏటీఎస్ తెలిపింది.
2022 జూన్ నుంచి డిసెంబర్ మధ్య వీరిద్దరూ చాటింగ్ చేసుకున్నట్లు ఏటీఎస్ గుర్తించింది. రక్షణ రంగ ప్రాజెక్టులకు సంబంధించి కీలక సమాచారాన్ని ప్రదీప్ ఆమెకు పంపినట్లు సమాచారం. అయితే ప్రదీప్ కార్యకలాపాలపై అనుమానం రావడంతో డీఆర్‌డీఓ అంతర్గత దర్యాప్తు చేపట్టింది. ఈ విషయం తెలియగానే ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రదీప్.. జారా నంబరును బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఐపీ అడ్రసు ద్వారా ఆమె నంబరును ట్రేస్ చేయగా.. పాకిస్థాన్ నుంచి చాట్ చేసినట్లు గుర్తించిన ఏటీఎస్..ఆమె పాక్ ఇంటిలిజెన్స్ గా నిర్ధారించింది.కాగా,మే 3న అరెస్టైన ప్రదీప్.. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.