ఫిలిప్పీన్స్లో వరుస భూకంపాలు.. ఉలిక్కిపడ్డ జనం..
X
వరుస భూకంపాలతో ఫిలిప్పీన్స్ ఉలిక్కిపడింది. గత మూడు రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు వచ్చాయి. దీంతో అక్కడి ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. తాజాగా లుజోన్‌లో మంగళవారం 5.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంపం కారణంగా రాజధాని మనీలాలోని బిల్డింగులను ఖాళీ చేయాలని ప్రభుత్వం ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది.
తాజా భూకంపం భూమికి 79 కిలోమీటర్ల లోతులో వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. రాజధానిలోని సెనెట్, అధ్యక్ష భవనం ఉద్యోగులు ఖాళీ చేశారు. విద్యార్థులు యూనివర్సిటీల నుంచి బయటకు పరుగులు పెట్టారు. శనివారం సైతం ఫిలిప్పీన్స్ లో 6.2 తీవ్రతతో భూమి కంపించింది.
ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, జపాన్ తదితర దేశాలు పసిఫిక్ మహాసముద్రంలో ‘రింగ్ ఆఫ్ ఫైర్’ జోన్‌లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉండటంతో పాటు భూమి అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలిక ఎక్కువగా ఉంటోంది. దీనివల్లే ఆ ప్రాంతంలో తరుచుగా భూకంపాలు వస్తుంటాయి. ఫలితంగా సునామీల ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది.