మనీ లాండరింగ్ కేసులో డెక్కన్ క్రానికల్ మాజీ చైర్మన్ అరెస్ట్
X
ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక డెక్కన్ క్రానికల్ మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డిని హైదరాబాద్‌లో ఈడీ అరెస్ట్ చేసింది. కెనరా బ్యాంకు, ఐడీబీఏ బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని .. మనీ లాండరింగ్ కేసులో విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో వెంకట్రామ్ రెడ్డి సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఈ ముగ్గుర్నీ కాసేపట్లో ఈడీ కోర్టులో హాజరుపరచనుంది. 8వేల కోట్ల రూపాయల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఈడీ అభియోగాలు మోపింది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులో డెక్కన్ క్రానికల్‌కు చెందిన 363 కోట్ల రూపాయల విలువ చేసే 14 ఆస్తుల్ని అటాచ్ చేసింది. అలాగే డెక్కన్ క్రానికల్ స్కామ్ పై ఆరు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసింది ఈడీ. వెంకట్రామిరెడ్డి అప్పుల పర్వం 2005లో మొదలైంది. ఆ తర్వాత 2009-11 మధ్య వందల కోట్ల రూపాయలు వేర్వేరు బ్యాంకుల నుంచి ఆయన సంస్థ డీసీహెచ్‌ఎల్ అప్పులు చేసింది.
అయితే వెంకట్రామిరెడ్డి తమను మోసగించారంటూ 2013లో కెనరా బ్యాంక్ సీబీఐకి ఫిర్యాదు చేసింది. వేర్వేరు బ్యాంకుల్లో ఒకే ఆస్తిని తనఖా పెట్టినట్టు ఫిర్యాదులో వివరించింది. కెనరా బ్యాంక్ కేసు ఫిర్యాదుతో.. రుణాలు సొంతానికి వాడుకున్నారని సీబీఐ కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేసింది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ కూడా ఎంటర్ అయింది. గతంలో 3,300 కోట్లకుపైగా వెంకట్రామిరెడ్డి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ… పెద్ద మొత్తంలో రుణాలు దారి మళ్లించినట్లు అభియోగాలు మోపింది. అయితే మొదట్లో విచారణకు హాజరైన వెంకట్రామి రెడ్డి అండ్ కో ఆ తర్వాత విచారణకు డుమ్మా కొట్టింది. ఈ క్రమంలోనే మరోసారి విచారణకు పిలిచింది. విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో వెంకట్రామిరెడ్డితో పాటు పీకే అయ్యర్, మని ఓమెన్‌లను అరెస్ట్ చేసింది.