లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు నోటీసులు
X
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేసింది. నవంబర్ 2న విచారణకు రావాలని ఆదేశించింది. లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్కు సంబంధించి దర్యాప్తులో భాగంగా విచారణకు రావాలని సమన్లలో ఈడీ స్పష్టం చేసింది.
లిక్కర్ స్కాంకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్లో సీబీఐ అరవింద్ కేజ్రీవాల్ ను ప్రశ్నించింది. అప్పుడు సీబీఐ అధికారులు దాదాపు 9 గంటల పాటు ఆయనను విచారించారు. తాజాగా మనీలాండరింగ్ కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఇదే కేసులో జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ నిరాకరించిన గంటల వ్యవధిలోనే ఈడీ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేయడం విశేషం.
ఇదిలా ఉంటే మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ తిరస్కరించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. వాస్తవానికి కేసు విచారణ అక్టోబర్ 17న పూర్తికాగా.. ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. లిక్కర్ స్కాం కేసులో రూ.338 కోట్ల నగదు లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ ఆధారాలు చూపించండంతో బెయిల్ నిరాకరిస్తున్నట్లు చెప్పింది. మరోవైపు లిక్కర్ స్కాం కేసులో విచారణను పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు ఈడీకి 6 నుంచి 8 నెలల సమయం ఇచ్చింది. విచారణ నెమ్మదిగా సాగితే 3 నెలల్లోపు సిసోడియా మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హత పొందుతారని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.