Arvind Kejriwal:ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఐదోసారి సమన్లు పంపిన ఈడీ
X
మద్యం కుంభకోణం కేసు (Delhi liquor policy case)లో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ మనీలాండరింగ్ కేసులో ఫిబ్రవరి 2న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఇప్పటికే నాలుగు సార్లు సమన్లు జారీ చేసినా ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. తొలుత నవంబరు 2న, ఆ తర్వాత డిసెంబరు 21, జనవరి 3, జనవరి 18న తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసింది. అయితే, వివిధ కారణాలు చూపి ఆయన వాటిని తిరస్కరించారు. ఈ క్రమంలోనే తాజాగా ఐదోసారి ఈడీ సమన్లు పంపింది. విచారణకు రమ్మని పిలిచింది. ఈసారి కేజ్రీవాల్ గైర్హాజరైతే అరెస్టు వారెంట్ నిమిత్తం కోర్టును ఆశ్రయించాలని దర్యాప్తు సంస్థ భావిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు, ఈ సమన్లు చట్టవిరుద్ధమైనవని కేజ్రీవాల్ ఆరోపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనను విచారణకు పిలుస్తున్నారంటూ కేంద్రాన్ని దుయ్యబట్టారు. ఈడీ నోటీసులను బీజేపీ ప్రతీకార రాజకీయ చర్యగా.. సార్వత్రిక ఎన్నికల ముందు జరుపుతున్న కుట్రగా అభివర్ణిస్తున్నారు. తన జీవితంలో దాచడానికి ఏమీ లేదని, తాను ఈ సమన్లను స్వీకరించబోనని గతంలో చెప్పారు. కాగా, మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ.. కేజ్రీవాల్‌ను విచారించిన విషయం తెలిసిందే. గతేడాది ఏప్రిల్‌లో ఆయనను 9 గంటల పాటు ప్రశ్నించారు. తాజాగా ఈడీ నమోదు చేసిన కేసులోనూ ఆయనకు సమన్లు అందాయి. ఇక, ఇదే కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను అరెస్టు చేశారు.