బెట్టింగ్ యాప్ కేసులో మరో ముగ్గురికి ఈడీ సమన్లు
X
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసులో బాలీవుడ్కి చెందిన హుమా ఖురేషి, కపిల్ శర్మ, హీనా ఖాన్‌లకు సమన్లు జారీ చేసింది. విచారణ నిమిత్తం రాయ్పూర్ ఆఫీసుకు రావాలని ఆదేశించింది. అయితే బెట్టింగ్ యాప్ స్కాంలో ఈ ముగ్గురు నిందితులు కాదని ఈడీ స్పష్టం చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ ప్రకారం దర్యాప్తు సంస్థ ఈ ముగ్గురి స్టేట్ మెంట్స్ రికార్డు చేయనుంది. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు వారికి ఏ రూపంలో చెల్లింపులు చేశారన్నదానిపై అధికారులు ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే అక్టోబర్ 6న విచారణకు హాజరుకావాలని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్కు ఈడీ అధికారుల ముందు ఇప్పటికే సమన్లు పంపారు. అయితే రణబీర్ విచారణకు హాజరయ్యేందుకు రెండు వారాల మినహాయింపు కోరినట్లు సమాచారం. అతని అభ్యర్థనపై ఈడీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మహదేవ్ యాప్‌కి ప్రమోషన్ కోసం తీసుకున్న మొత్తం, అతనితో కాంటాక్ట్‌లో ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకోవాలని ఈడీ భావిస్తోంది.
ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫాం మహాదేవ్ బుక్ యాప్ మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లో జరిగిన తన వివాహ వేడుక కోసం యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చుపెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ పెళ్లికి బాలీవుడ్ ప్రముఖులైన టైగర్ ష్రాఫ్, సన్నీలియోన్, నేహా కక్కర్, విశాల్ దద్లానీ, ఎల్లి అవ్రామ్, భారతీ సింగ్, భాగ్య శ్రీ, కృతి కర్బందా సహా పలువురు హాజరయ్యారు. ఈ క్రమంలో పెళ్లికి హాజరైన వారందరినీ ఈడీ ప్రశ్నించే అవకాశముంది.