Home > జాతీయం > ఈడీ అరెస్ట్.. బోరున ఏడ్చేసిన విద్యుత్ శాఖ మంత్రి.. video viral

ఈడీ అరెస్ట్.. బోరున ఏడ్చేసిన విద్యుత్ శాఖ మంత్రి.. video viral

ఈడీ అరెస్ట్.. బోరున ఏడ్చేసిన విద్యుత్ శాఖ మంత్రి.. video viral
X

మనీ లాండరింగ్ కేసులో తమిళనాడుకు చెందిన డీఎంకే నేత, విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో, కోయంబత్తూర్, కడూర్ నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. 18 గంటలపాటు మంత్రి నివాసంలో ప్రశ్నించిన ఈడీ అధికారులు ఆ తర్వాత ఆయన్ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. బాలాజీ భారీ స్థాయిలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా అధారాలు లభించాయని, బుధవారం తెల్లవారుజామున కస్టడీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన బోరున ఏడ్చారు. చాతినొప్పి అంటూ ఒక్కసారిగా కూలిపోయారు.

వెంటనే ఈడీ అధికారులు ఆయనను కట్టుదిట్టమైన భద్రత మధ్య వైద్య పరీక్షల కోసం స్థానికంగా ఉన్న ఒమందురార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పరీక్షలు చేయిస్తున్నారు. డీఎంకే నేతను ఆస్పత్రికి తీసుకురావడంతో బయట తీవ్ర డ్రామా నెలకొంది. ED చర్యకు వ్యతిరేకంగా ఆయన మద్దతుదారులు ఆస్పత్రి ముందు గుమిగూడారు. డీఎంకే ఎంపీ, న్యాయవాది ఎన్‌ఆర్‌ ఎలాంగో ఆయనను ఐసీయూకి తరలించారని, బాలాజీ అరెస్టును ఈడీ అధికారికంగా ధృవీకరించలేదని చెప్పారు. సెంథిల్ బాలాజీ చికిత్స పొందుతున్నారని డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. "మేము దానిని చట్టబద్ధంగా ఎదుర్కొంటాము. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యొక్క బెదిరింపు రాజకీయాలకు మేము భయపడము" అని ఆయన అన్నారు. ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సమయంలో బాలాజీ ఛాతీ నొప్పితో బాధపడినట్లు డీఎంకే నేతలు ఆరోపించారు. సెంథిల్ బాలాజీని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు స్పృహలో లేరని కూడా వారు ఆరోపించారు. అయితే ఈడీ అధికారులు.. మంత్రిని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు ఈ వ్యవహారంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్​ విరుచుకుపడ్డారు.సెక్రటేరియట్​లో మంత్రి బాలాజీ కార్యాలయంపై ఈడీ అధికారుల సోదాలు జరపడం ఫెడరలిజానికే మచ్చ తెచ్చే విధంగా ఉందని విమర్శించారు. ఇది బీజేపీ చేస్తున్న 'బ్యాక్​డోర్'​ బెదిరింపులని ఆయన మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడులో పర్యటించిన రెండు రోజుల తర్వాత ఇలాంటి పరిణామం జరగడం ఏంటని ​ ప్రశ్నించారు. బీజేపీ పాలనను తప్పుబట్టే రాజకీయ శక్తులపై.. మోదీ సర్కార్​ దర్యాప్తు సంస్థల సాయంతో ప్రతీకారం తీర్చుకుంటుందని స్టాలిన్​ అన్నారు.




Updated : 14 Jun 2023 7:51 AM IST
Tags:    
Next Story
Share it
Top