Arvind Kejriwal Arrest: నవంబర్ 2న కేజ్రీవాల్ అరెస్ట్... ఆప్ మంత్రి సంచలన ఆరోపణలు
X
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 2న విచారణకు రావాలని ఆ నోటిసుల్లో ఆదేశించింది. లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్కు సంబంధించి దర్యాప్తులో భాగంగా విచారణకు రావాలని నోటీసుల్లో ఈడీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆప్ మంత్రి సంచలన ఆరోపణలు చేశారు. నవంబర్ 2న కేజ్రీవాల్ను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని ఆరోపించారు.
బీజేపీకి వ్యతిరేకంగా కేజ్రీవాల్ పోరాడుతున్నందుకే ఆయన్ని అరెస్ట్ అవకాశం ఉందని ఆప్ మంత్రి అతీషీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఆప్ రెండు సార్లు ఓడించింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆప్ చేతిలో బీజేపీ ఓడిపోయింది. ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఓడించలేమని బీజేపీకి అర్థమైంది. కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారు. అందుకే ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారు’’ ఆప్ విమర్శించింది.
కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఇండియా కూటమిలోని ఇతర నేతలను కూడా బీజేపీ టార్గెట్ చేస్తుందని అతీషీ ఆరోపించారు. ‘‘విపక్ష పార్టీలకు చెందిన సీఎంలపై సీబీఐ, ఈడీతో బీజేపీ దాడులు చేయించే అవకాశం ఉంది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కేరళ సీఎం పినరయి విజయన్ వంటి నేతలు బీజేపీ టార్గెట్ లిస్ట్‌లో ఉన్నారు. బీజేపీ దాడులకు ఆప్ భయపడదు ’’ అతీషీ అన్నారు.
లిక్కర్ స్కాంకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్లో సీబీఐ అరవింద్ కేజ్రీవాల్ ను ప్రశ్నించింది. అప్పుడు సీబీఐ అధికారులు దాదాపు 9 గంటల పాటు ఆయనను విచారించారు. తాజాగా మనీలాండరింగ్ కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఇదే కేసులో జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ నిరాకరించిన గంటల వ్యవధిలోనే ఈడీ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేయడం విశేషం.