Egg Price : కొండెక్కిన కోడిగుడ్డు.. వారంలో భారీగా పెరిగిన ధర
X
కోడి గుడ్డు ధరలు కొండెక్కాయి. వారం రోజుల వ్యవధిలోనే డజన్ కోడి గుడ్ల ధర ఏకంగా రూ. 18వరకు పెరిగింది. దీంతో వినియోగదారులు కోడి గుడ్డు కొనేందుకు వెనకాడుతున్నారు. గతంలో రూ. 66 ఉన్న డజన్ కోడిగుడ్ల ధర, ఇప్పుడు ఒక్కో గుడ్డు రూ. 7 పలుకుతుండటంతో రూ. 84కి చేరింది.
కోళ్ల దాణా ధర పెరగడం కోడి గుడ్డు ధరపై ప్రభావం చూపింది. గతంలో రూ. 15 నుంచి రూ.17 వరకు ఉన్న కిలో కోళ్ల దాణా ధర ప్రస్తుతం రెట్టింపైంది. కిలో దాదాపు రూ.28కు చేరింది. దాణా ఖర్చు పెరగడం గుడ్ల ధర పెరగడానికి కారణమైందని వ్యాపారులు అంటున్నారు. గతంలో గుడ్డు ఒక్కోటి రూ.5.25 ధర పలికితే తమకు గిట్టుబాటు అయ్యేదని అయితే ప్రస్తుతం దాణా ధర పెరగడం, డిమాండ్‌కు తగ్గట్లు ఉత్పత్తి లేకపోవడంతో గుడ్ల ధర పెంచక తప్పడం లేదని కోళ్ల ఫాంల నిర్వాహకులు చెబుతున్నారు.
దాణాకు తోడు రవాణా ఖర్చు పెరగడం కూడా కోడి గుడ్ల ధర పెరగడానికి మరో కారణంగా తెలుస్తోంది. రంగారెడ్డి, షాద్‌నగర్, మహబూబ్ నగర్, మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని కొన్ని జిల్లాలకు కోడి గుడ్లను దిగుమతి చేసుకుంటున్నారు. రవాణా ఖర్చులు పెరగడంతో కోడి గుడ్డును రూ. 7కి విక్రయిస్తేనే గిట్టుబాటు అవుతుందని వ్యాపారులు అంటున్నారు. జిల్లాల్లో ప్రస్తుతం రోజుకు 15 నుంచి 20 లక్షల కోడి గుడ్ల అమ్మకాలు జరుగుతన్నాయని, డిమాండ్ ఇలాగే కొనసాగితే ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.