ప్రారంభమైన పోలింగ్.. ఓటేయలేకపోయిన మిజోరం సీఎం
X
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొదటగా మిజోరాం, ఛత్తీస్ గడ్ లలో మంగళవారం ఉదయం పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఛత్తీస్ గడ్ లో తొలి విడతలో 20 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మిజోరాంలో ఒకే విడతలో 40 స్థానాలకు పోలింగ్ జరగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం మూడు వరకు పోలింగ్ జరగనుంది. ఈ ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 3 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. చిత్రకోట్‌లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకూ పోలింగ్ ఉంటుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 600 పోలింగ్ కేంద్రాలున్నాయి. తొలిదశ పోలింగ్‌లో 40.78 లక్షల మంది ఓటర్లు ఓటు వేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 223 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. వారిలో 25 మంది మహిళా అభ్యర్థులున్నారు.మిజోరంలో 40 స్థానాలకు 174 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 8.5 లక్షల మంది ఓటర్లు వారి భవిష్యత్తును తేల్చుతున్నారు. వారి కోసం 1276 పోలింగ్ కేంద్రాలున్నాయి. అలాగే 5,292 మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు.ష
మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రయత్నించగా.. ఈవీఎం పనిచేయలేదు. ఈ ఉదయం ఐజ్వాల్ నార్త్-2 నియోజకవర్గ పరిధిలోని 19-ఐజ్వాల్ వెంగ్లాయ్-1 పోలింగ్ కేంద్రానికి వెళ్లారు జోరంతంగా . అయితే అక్కడి ఈవీఎం పనిచేయకపోవడంతో ఆయన ఓటు వేయలేకపోయారు. కొంతసేపు ఎదురుచూసి వెనుదిరిగారు. ‘‘మిషన్ పనిచేయకపోవడంతో తొలి గంటలో ఓటు వేయలేకపోయా. నా నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన అనంతరం మళ్లీ ఓటేసేందుకు వస్తా’’ అంటూ ఆయన అక్కడి నుంచి బయల్దేరారు.