చెడు శకునమంటూ కామెంట్.. రాహుల్కు ఎలక్షన్ కమిషన్ షాక్
X
ప్రధాని నరేంద్రమోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. మోడీ చెడు శకునం అంటూ చేసిన కామెంట్లకుగానూ నోటీసులు జారీ చేసింది. బీజేపీ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. శనివారం సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని రాహుల్ గాంధీని ఆదేశించింది.
నవంబర్ 21న రాజస్థాన్ బార్మర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఓ చెడుశకునం వెళ్లినందునే టీమిండియా ఓడిపోయిందని ప్రధాని మోడీపై పరోక్షంగా విమర్శించారు. రాహుల్ కామెంట్లపై బీజేపీ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది. మోడీని చెడుశకునం అనడంపై అభ్యంతరం చెప్పింది. అంతేకాక రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు చేశారని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తెచ్చింది.
ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ప్రత్యర్థులపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్న అంశాన్ని నోటీసుల్లో ప్రస్తావించిన ఎలక్షన్ కమిషన్.. ఈ నెల 25లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.