Loksabha Election 2024 : మార్చిలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్.. 7 విడతల్లో పోలింగ్..?
X
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లలో బిజీ అయింది. ఎన్నికల సంసిద్ధతకు సంబంధించి పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. ఆ ప్రక్రియ పూర్తైన వెంటనే ఎన్నికల తేదీ ప్రకటించేందుకు సీఈసీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మార్చి 13 తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడే అవకాశమున్నట్లు సమాచారం.
ఎన్నికల సన్నద్దతకు సంబంధించి ఎలక్షన్ కమిషనర్ల రాష్ట్రాల పర్యటన చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్నారు. అనంతరం ఉత్తరప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిని సమీక్షించనున్నారు. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల సన్నద్దతకు సంబంధించిన వివరాల సేకరణకు మరో 15 నుంచి 20 రోజుల సమయం పట్టే అవకాశముంది. ఈ లెక్కన మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముందని అధికారులు అంటున్నారు.
లోక్‌సభ ఎలక్షన్లతో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సైతం జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ గడువు త్వరలోనే ముగియనుంది. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆయా రాష్ట్రాల ఎలక్షన్లు జరగనున్నాయి. వీటితో పాటు జమ్మూ కశ్మీర్ లో కూడా అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ సిద్ధం చేస్తోంది.
2019లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న రిలీజ్ చేశారు. ఏప్రిల్ 11 నుంచి మే 19 మధ్య 7 దశల్లో పోలింగ్ నిర్వహించారు. మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.