లోక్సభకు ముందస్తు ఎన్నికలు.. సీఎం సంచలన వ్యాఖ్యలు
X
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలు ముందస్తుగా జరగొచ్చని అన్నారు. సోమవారం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిసెంబర్ లేదా జనవరిలోనే లోక్ సభ ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. తాజాగా నితీశ్ సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. విపక్షాల ఐక్యతతో నష్టం జరుగుతుందని భయపడుతున్న బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని నితీశ్ అన్నారు.
నలంద ఓపెన్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం పాల్గొన్న నితీశ్.. మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. బీజేపీ లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తాను ఈ విషయాన్ని 7 - 8 నెలల నుంచే చెబుతున్నానని అన్నారు. బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని నితీశ్ అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా వీలైనన్ని ఎక్కువ పార్టీలను ఏకం చేయాలన్నదే తన లక్ష్యమన్న ఆయన.. త్వరలోనే మరికొన్ని రాజకీయపక్షాలు ఇండియా కూటమిలోకి రాబోతున్నాయని చెప్పారు. అయితే ఆ పార్టీల వివరాలు చెప్పేందుకు నిరాకరించారు.