Home > జాతీయం > electoral bonds: ఏ రాజకీయ పార్టీ, ఎన్ని నిధులు అందుకున్నదీ వెల్లడించాలి.. సుప్రీంకోర్టు

electoral bonds: ఏ రాజకీయ పార్టీ, ఎన్ని నిధులు అందుకున్నదీ వెల్లడించాలి.. సుప్రీంకోర్టు

electoral bonds: ఏ రాజకీయ పార్టీ, ఎన్ని నిధులు అందుకున్నదీ వెల్లడించాలి.. సుప్రీంకోర్టు
X

రాజకీయ పార్టీలకు విరాళాలు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల (electoral bonds scheme) చెల్లుబాటును రద్దు చేస్తూ సుప్రీంకోర్టులో (Supreme court) గురువారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్‌లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై విచారణ పూర్తైన సందర్బంగా సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగీవ్ర తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో అసలు ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏంటి? వీటిని ఎందుకు ఉపయోగిస్తారు అనే ప్రశ్నలు సామాన్యులను తలెత్తుతున్నాయి.

ఎలక్టోరల్ బాండ్లు అంటే ఎన్నికల బాండ్లు... అనేవి ఓ ప్రామిసరీ నోటు లాంటివి. ఈ బాండ్లు రూ.1000, రూ.10,000, లక్షా, 10 లక్షలు, ఒక కోటి రూపాయాల విలువతో కేవలం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI)లోనే లభ్యమవుతాయి. వ్యక్తులు కానీ, కంపెనీలు కానీ వీటిని కొనుగోలు చేయవచ్చు. ఇలా ఎన్ని బాండ్లయినా కొనుగోలు చేయవచ్చు. ఇందుకు పరిమితి లేదు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా(Fund) ఇవ్వొచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. ఒకవేళ 15 రోజుల్లోపు సంబంధిత రాజకీయ పార్టీ నగదు తీసుకోకపోతే ఆ డబ్బును ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కు ఎస్బీఐ జమ చేస్తుంది.

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. 2017 కేంద్ర బడ్జెట్ లో ఎలక్టోరల్ బాండ్ల గురించి మొదటగా ప్రవేశపెట్టింది. రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం-2017 సవరణ చేసింది. ఫలితంగా ఈ ఎలక్టోరల్ బాండ్లు.. కొనుగోలుదారులు లేదా చెల్లించిన వారికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని కలిగి ఉండవు. కేవలం రాజకీయ పార్టీలకు చెందినవిగా పరిగణించబడుతుంది. 2018 మార్చి నుంచి 2021 జనవరి మధ్య కాలంలో రూ.6534.78 కోట్ల విలువైవ 12,924 ఎలక్టోరల్ బాండ్లను 15 దశల్లో విక్రయించారు. 2017లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో అనామక విరాళాలు ఇచ్చేందుకు కంపెనీలకు ఓ మార్గంగా ఎలక్టోరల్ బాండ్లు ప్రారంభించారు.

వ్యక్తుల పేర్లు, సంస్థలు, ధార్మిక ట్రస్టుల, ఎన్జీఓల పేర్లు బహిర్గతం చేయకుండా ఈ బాండ్ల ద్వారా పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి అనుమతి ఉంది. దీంతో ఎలక్టోరల్ బాండ్లు విరాళంగా ఇచ్చే దాతల పేర్లు చెప్పకపోవడం అనుమానానికి తావిచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టడానికి ముందు రాజకీయ పార్టీలు 20 వేల కంటే ఎక్కువ విరాళాలు ఇచ్చిన తమ దాతల వివరాలను బహిర్గత పరచాల్సి ఉండేది. కానీ ఈ తాజా సవరణతో ప్రజలు వీటి గురించి తెలుసుకోలేరు. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ పిటీషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఎల‌క్టోర‌ల్ బాండ్ల స్కీమ్ రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని తెలిపింది. ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌ను జారీ చేసే బ్యాంకులు త‌క్ష‌ణ‌మే బాండ్ల‌ను నిలిపివేయాల‌ని కోర్టు త‌న తీర్పులో తెలిపింది. నిధులు అందుకున్న రాజ‌కీయ పార్టీలు వివ‌రాల‌ను ఎస్‌బీఐ బ్యాంకు వెల్ల‌డించాల‌ని కోర్టు కోరింది. మార్చి 6వ తేదీలోగా ఎన్నిక‌ల సంఘానికి ఆ వివ‌రాల‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ప్ర‌తి బాండ్‌కు చెందిన వివ‌రాల‌ను ఎస్బీఐ వెల్ల‌డించాలని పేర్కొంది.

Updated : 15 Feb 2024 6:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top