రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్.. ఉద్యోగులకు దీపావళి బోనస్
X
తన కంపెనీలో పనిచేస్తున్న 15 మంది ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లను ఇచ్చారు ఓ యజమాని. డ్రైవర్ నుంచి మేనేజర్ వరకు తేడా లేకుండా అందరికీ బైక్‌లను బోనస్‌గా ఇచ్చారు. తమిళనాడులోని తిరుప్పుర్ కు చెందిన శివకుమార్ అనే వ్యాపారవేత్త ... కోటగిరి ప్రాంతంలో దాదాపు 20 ఏళ్లుగా నివసిస్తున్నారు. ఇక్కడే ఓ ఎస్టేట్ కొని.. అందులో క్యాలీఫ్లవర్, క్యారెట్, బీట్రూట్, స్ట్రాబెర్రీ తదితర కూరగాయలు పండ్ల సాగు చేస్తున్నారు. అయితే అతడి కంపెనీలో పని చేసే ఉద్యోగులకు ప్రతి ఏడాది దీపావళి సందర్భంగా సర్ప్రైజ్ కానుకలు ఇవ్వడం అలవాటు. అందులో భాగంగా ఈసారి డ్రైవర్ నుంచి మేనేజర్ స్థాయి వరకు తన ఉద్యోగుల్లో 15 మందిని ఎంపిక చేశారు. వారికి నచ్చిన బైక్ లు ఏంటో తెలుసుకుని.. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, యమహా రే స్కూటర్ మోడల్స్‌లో 15 బైక్‌లను బుక్ చేశారు. అనంతరం వాటిని ఉద్యోగులకు ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఈ సర్ప్రైజ్ను ఊహించని ఉద్యోగులు ఆనందంలో మునిగిపోయారు.
ఈ విషయమై శివకుమార్ మాట్లాడుతూ.. 'మన కోసం కష్టపడి పనిచేసే ఉద్యోగులను సంతోషంగా ఉంచాలని భావించినప్పుడు.. వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. అందులో భాగంగా సంస్థ తరఫున వారికి వసతి, వారి పిల్లలకు వైద్యం, విద్య వంటివి అందిస్తున్నాం. అలాగే మా కంపెనీలో పని చేసే ఉద్యోగులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. ఈ సందర్భంగా నేను ఇతర వ్యాపారవేత్తలకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మనం ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం ఉద్యోగులే. కాబట్టి వ్యాపారస్థులు తమ ఉద్యోగులను సంతోషంగా ఉంచాలి. వారి అవసరాలను తీర్చాలి. దాని ద్వారా మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. దాంతో పాటు మీ ఉద్యోగుల జీవితాలు కూడా మెరుగుపడతాయి. అప్పుడు సమాజం కూడా బాగుపడుతుంది' అని తెలిపారు.