పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఆ ప్రూఫ్గా ఆధార్ చెల్లదు
X
పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ అలర్ట్ ప్రకటించింది. ఆధార్కు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చింది. ఇకపై పీఎఫ్ అకౌంట్లో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకునేందుకు, ప్రూఫ్ గా ఆధార్ పనిచేయదని ప్రకటించింది. బర్త్ డే అప్ డేట్ కు సంబంధించిన ప్రూఫ్ డాక్యుమెంట్స్ లిస్టు నుంచి ఆధార్ ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో పీఎఫ్ అకౌంట్లో డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ లేదా కరెక్షన్ కోసం ప్రూఫ్గా ఆధార్ కార్డును చూపిస్తే చెల్లదు.
"డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ డాక్యుమెంట్ లిస్ట్ నుంచి ఆధార్‌ను తొలగించాం. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఆధార్ కార్డును వినియోగించకూడదని, ఆమోదించదగిన డాక్యుమెంట్ల జాబితా నుంచి దాన్ని తొలగించాలని.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి లేఖ వచ్చిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నాం.' అని జనవరి 16, 2024న జారీ చేసిన సర్క్యూలర్‌లో ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది.
ఈపీఎఫ్ఓ తాజా నిర్ణయంతో ఇకపై పీఎఫ్ అకౌంట్ హోల్డర్ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకునేందుకు రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్, ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ, స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్, టీసీ, ఎస్ఎస్ఈ సర్టిఫికెట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆర్గనైజేషన్ల సర్వీస్ రికార్డు సర్టిఫికెట్లు ప్రూఫ్ గా చూపవచ్చు. అవి లేనిపక్షంలో సివిల్ సర్జన్ పరీక్ష చేసి జారీ చేసిన మెడికల్ సర్టిఫికెట్తో పాటు అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పాస్ట్‌పోర్ట్, పాన్ కార్డు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్, సీజీహెచ్ఎస్ లేదా ఈసీహెచ్ఎస్ లేదా మెడి క్లెయిమ్ కార్డు, ప్రభుత్వం జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రం చూపించవచ్చు.
యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ఆధార్ కార్డు సంబంధిత వ్యక్తి గుర్తింపు, చిరునామా రుజువుగా మాత్రమే ఉపయోగపడుతుంది. దాన్ని పుట్టిన తేదీ రుజువుగా ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే 12 అంకెల కార్డును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. ఈ కార్డును దేశవ్యాప్తంగా ఎక్కడైనా గుర్తింపు కార్డుగా, అడ్రస్ ప్రూఫ్గా ఉపయోగించుకోవచ్చు.