Home > జాతీయం > ముంచుకొస్తున్న బిపోర్ జాయ్ ముప్పు.. గుజరాత్లో హై అలర్ట్

ముంచుకొస్తున్న బిపోర్ జాయ్ ముప్పు.. గుజరాత్లో హై అలర్ట్

ముంచుకొస్తున్న బిపోర్ జాయ్ ముప్పు.. గుజరాత్లో హై అలర్ట్
X

బిపోర్‌ జాయ్‌ తుఫాను ముంచుకొస్తోంది. అతి తీవ్రంగా మారిన తుఫాను జూన్ 15న గుజరాత్‌లోని కచ్‌ జిల్లా జఖౌ వద్ద తీరాన్ని తాకనుంది. ఆ సమయంలో 150 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ ప్రకటించింది. తుఫాను నేపథ్యంలో గుజరాత్‌ తీరంలోని కచ్‌, పోర్‌బందర్‌, ద్వారక, జాంనగర్‌, జునాగఢ్‌, మోర్బి జిల్లాల్లో అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కచ్‌ తీరానికి ఐఎండీ ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది.

అప్రమత్తమైన అధికారులు

తుఫాను నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సముద్రతీరానికి దగ్గరలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 10వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తుఫాను కారణంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. మరోవైపు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. ఆర్మీ, నేవీ, కోస్టు గార్డులు సైతం సిద్ధంగా ఉన్నారు. సౌరాష్ట్ర, కచ్‌లలో భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ ప్రకటంచింది. కచ్‌ జిల్లాలో 144 సెక్షన్‌ను విధించిన అధికారులు.. 15వ తేదీ వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.

ముంబైకు పొంచి ఉన్న ముప్పు

మరోవైపు దేశ వాణిజ్య రాజధాని ముంబైకు సైతం తుఫాను ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలు పడే అవకాశముండటంతో అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా ముంబై ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. గాలుల తీవ్రత కారణంగా కొన్ని విమానాలను రద్దు చేయగా.. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మోడీ సమీక్ష

తుపాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఢిల్లీ, రాజస్థాన్‌, పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ ప్రకటించింది. వెల్లడించింది. తీవ్ర తుఫాను ముంచుకొసతున్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై ప్రధాని మోడీ సోమవారం సమీక్ష నిర్వహించారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర హోంశాఖ 24 గంటలూ తుపాను పరిస్థితిని సమీక్షిస్తోందని పీఎంఓ ప్రకటించింది. ఇప్పటికే12 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయని, మరో 15 స్టాండ్‌బైలో ఉన్నాయని వివరించింది.



Updated : 13 Jun 2023 8:17 AM IST
Tags:    
Next Story
Share it
Top