Home > జాతీయం > Dayanidhi Maran : కేంద్ర మాజీ మంత్రికి సైబర్‌ నేరగాళ్ల టోకరా.. క్షణాల్లో డబ్బు మాయం

Dayanidhi Maran : కేంద్ర మాజీ మంత్రికి సైబర్‌ నేరగాళ్ల టోకరా.. క్షణాల్లో డబ్బు మాయం

Dayanidhi Maran : కేంద్ర మాజీ మంత్రికి సైబర్‌ నేరగాళ్ల టోకరా.. క్షణాల్లో డబ్బు మాయం
X

సామాన్యుల నుంచి సెలబ్రిటీలను సైతం ఎవర్నీ వదలట్లేదు సైబర్ నేరగాళ్లు. తాజాగా సాక్షాత్తు కేంద్ర మాజీ మంత్రినే టార్గెట్‌ చేసి.. ఆయన బ్యాంక్ అకౌంట్ నుంచి దాదాపు లక్ష రూపాయల వరకు కొట్టేశారు. తమిళనాడుకు చెందిన కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ (Dayanidhi Maran) అకౌంట్ నుంచి రూ.99,999 నగదును సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన తన సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. డిజిటల్‌ ఇండియాలో వ్యక్తిగత సమాచారం సురక్షితంగా లేదని చెబుతూ ఆయన మోసం జరిగిన తీరును వివరించారు. ఓటీపీ అవసరం లేకుండా, తన వ్యక్తిగత మొబైల్‌కు ఎలాంటి పేమెంట్ లింక్‌ రాకుండా సైబర్‌ నేరగాళ్లు నగదు కొట్టేశారని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఆదివారం తన ఖాతా నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయని చెప్పిన దయానిధి మారన్... తన మొబైల్‌కు ఓటీపీ కూడా రాలేదని అన్నారు. జాయింట్‌ అకౌంట్ హోల్డర్ అయిన తన భార్యకు సైబర్‌ దుండగులు ఫోన్‌ చేసి డబ్బులు కాజేశారన్నారు. ఇన్‌కమ్‌ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఫోన్ చేస్తున్నామని నమ్మించి, మనీ ట్రాన్సక్షన్స్ గురించి అడిగారన్నారు. ఆ వెంటనే అకౌంట్ నుంచి నగదు బదిలీ అయిందని చెప్పారు. విషయం తెలియగానే బ్యాంక్‌ అధికారులకు కంప్లైంట్ చేసి అకౌంట్ ను బ్లాక్ చేయించినట్లు చెప్పారు. తన వ్యక్తిగత వివరాలు (ఫోన్‌ నంబర్‌, మెయిల్‌ ఐడీ, బ్యాంకు ఖాతా నంబర్) సైబర్‌ నేరగాళ్ల చేతికి ఎలా వెళ్లాయి? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డిజిటల్‌ ట్రాన్సక్షన్స్, సైబర్ మోసాల గురించి అవగాహన కలిగిన తమ పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. ఓటీపీ రాకుండా తన ఖాతా నుంచి సొమ్ము ఎలా బదిలీ అయ్యిందో యాక్సిస్‌ బ్యాంక్‌ అధికారులు కూడా చెప్పలేకపోతున్నారని తెలిపారు.

ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు, ప్రైవేట్‌ సంస్థలు పటిష్ఠ సైబర్‌ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. 2020 జనవరి నుంచి 2023 జూన్‌ వరకు జరిగిన సైబర్‌ నేరాల్లో 75 శాతం నగదు లావాదేవీలకు సంబంధించనవే ఉన్నాయని దయానిధి మారన్ తెలిపారు. ప్రజల వ్యక్తిగత డేటాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ట్వీట్‌లో పేర్కొన్నారు.




Updated : 11 Oct 2023 9:25 AM IST
Tags:    
Next Story
Share it
Top